ఒకటి రెండు రోజుల నుంచి జగన్ విజువల్స్ గమనిస్తున్నారా.. ఏమైనా తేడా కనిపిస్తోందా.. ఆయన తరచూ ప్రెస్ మీట్స్ పెట్టరు. కానీ ప్రెస్ మీట్స్ పెట్టకపోయినా.. ఆయన రోజూ నిర్వహించే సమీక్షల తాలూకూ విజువల్స్, ఫోటోలను ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ మీడియాకు ఇస్తుంటుంది. మీరు గమనించారో లేదో కానీ.. ఇలాంటి విజువల్స్ లో ఓ చెప్పుకోదగ్గ మార్పు చోటుచేసుకుంది.

 

 

అదేమిటంటే జగన్ సీటు బ్యాక్ గ్రౌండ్.. అంతకుముందు జగన్ బ్యాక్ డ్రాప్‌లో పూర్ణ వికసిత కుంభం తరహాలో ఓ భారీ చక్రం బంగారు రంగులో ఉండేది. వాస్తవానికి ఇది పాత సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టిన కొత్త ఒరవడి. అమరావతి ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు ఈ పూర్ణ వికసిత కుంభం డిజైన్ చేయించారని అప్పట్లో టాక్ వచ్చింది. పూర్ణ వికసిత కుంభానికి భౌద్ద సంప్రదాయాల్లో పెద్ద పీట వేస్తారు. అమరావతి బౌద్దం విలసిల్లిన ప్రాంతంగా చంద్రబాబు చెప్పేవారు. అందుకే అలాంటి డిజైన్‌ ముందు కూర్చునే వారు.

 

 

అయితే జగన్ సీఎం అయ్యాక కూడా అదే సంప్రదాయం కొనసాగింది. అయితే ఈ పూర్ణ వికసిత కుంభం బ్యాక్ డ్రాప్ లో ఉండటం అంత మంచిది కాదని.. అది నెగిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తుందని.. దాన్ని మార్చాలని సోషల్ మీడియాలో ఎవరో ఓ జగన్ శ్రేయోభిలాషి సుదీర్ఘమైన విన్నపం చేశాడు. మరి దాని ప్రభావమో ఏమో కానీ.. రెండురోజుల క్రితం జగన్ బ్యాక్ డ్రాప్ ఛేంజ్ అయ్యింది. పూర్ణ వికసిత కుంభం స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నం వచ్చి చేరింది.

 

 

ఇప్పుడు ఈ మార్పు సర్వత్రా చర్చనీయాంశమైంది. సదరు సోషల్ మీడియాకు అనుగుణంగానే గతంలో చంద్రబాబు తరహాలోనే ఇప్పుడు జగన్ కూడా తనకు రాజకీయంగా కలసిరాదని భయపడ్డారా..లేక.. ఈ మార్పు అనుకోకుండా జరిగిందా అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ విషయంపై ఎలాగూ అధికారికంగా ప్రకటన ఉండదు కాబట్టి.. ఎవరికి తోచింది వారు ఊహించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: