రాజకీయ కురువృద్ధుడు రాయపాటి సాంబశివరావు చాలారోజుల తర్వాత ఏపీ పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలక నాయకుడుగా ఎదిగిన రాయపాటి, రాష్ట్రం విడిపోయాక టీడీపీలో చేరి, 2014లో నరసరావుపేట ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికలొచ్చేసరికి రాయపాటి అదే స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.

 

ఇక ఓడిన దగ్గర నుంచి రాయపాటి టీడీపీలో పెద్దగా కనిపించలేదు. పైగా ఆయన బీజీపీ నేతలకు టచ్ లోకి కూడా వెళ్లారు. బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు కూడా. దీంతో ఆయన బీజేపీలోకి వెళుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే సమయంలో వైసీపీలోకి కూడా వెళ్లే ఛాన్స్ ఉందని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయన ఎటు వెళ్లకుండా టీడీపీలోనే ఉన్నారు. అలా అని పార్టీలో యాక్టివ్ గా లేరు. అయితే ఆయన తనయుడు రాయపాటి రంగబాబు మాత్రం టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్నారు.

 

అయితే ఇన్నాళ్లు పెద్దగా యాక్టివ్ గా లేని రాయపాటి, సడన్ గా వచ్చి, జగన్ పై విమర్సలు చేసేసారు. అది కూడా జగన్ కమ్మ సామాజికవర్గంపై కక్ష కట్టారని, మాటకు మెదిలితే కమ్మ కమ్మ అంటున్నారని, కమ్మవాళ్ళు తలచుకుంటే జగన్ రెడ్డి లేచిపోతాడని మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మళ్ళీ రాయపాటి క్లారిటీ ఇస్తూ, కమ్మ వాళ్ళు తలుచుకుంటే జగన్ రెడ్డి లేచిపోతాడని తాను ఎక్కడా వ్యాఖ్యానించలేదని చెప్పుకొచ్చారు.

 

తనపై లేని పోనీ కథనాలు ప్రచురించారని, పైగా తనకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సోషల్ మీడియాలో కూడా అసభ్యంగా పోస్టులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకపోతే సీఎం స్థాయి వ్యక్తి తరచూ కులాల ప్రస్తావన తేవడం తనని బాధించిందని అన్నారు. అయితే రాయపాటి ప్లేటు ఫిరాయించారని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో కమ్మ సామాజికవర్గానికి జగన్ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో మంత్రి కొడాలి నానినీ చూస్తే అర్ధమవుతుంది. అలాగే తమ పార్టీలో కమ్మ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారని, ఆఖరికి వల్లభనేని వంశీ, కరణం బలరాంలు జగన్ కు మద్దతు ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: