క‌రోనా క‌ల‌క‌లం స‌మ‌యంలో తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. తాజాగా ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌న్నిహితుడు అనే పేరున్న పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ‌లో ప్రతి ఒక్క లబ్దిదారుడికి ఉచితంగా 12 కిలోల బియ్యం , ప్రతి కుటుంబానికి రూ. 1500 నగదు పంపిణీ విషయంలో పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన విమర్శలు బాధాకరమని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ రాజ‌కీయ‌వేత్త‌, మంత్రిగా పనిచేశారని అయినా విమ‌ర్శ‌లు చేయ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు.

 

``రాష్ట్రంలో ఏ పేదవాడిని అడిగినా ప్రభుత్వం చేసిన సహాయం, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మనస్తత్వం గురించి చెపుతారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సహాయం తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇది ముఖ్యమంత్రి ముందుచూపు, పేదలను ఆదుకోవాలనే ఆలోచన. కోవిడ్-19 నియంత్రణకు లాక్ డౌన్ అమలు నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకోవడానికి మనసున్న మహారాజుగా కె. చంద్రశేఖరరావు నెల రోజులకు సరిపడే ఉచిత బియ్యం, ఇతర సరుకుల కోసం ఒక్కో తెల్లరేషన్ కార్డుదారులకు రూ. 1500 నగదు అందించాలని మార్చ్ 22వ తేదీన ప్రకటన చేశారు. దీని ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 91% మందికి బియ్యాన్ని, 74 లక్షల్లో బియ్యం తీసుకున్న వారిలో 90% మందికి నగదును పంపిణీ చేశాం. రెండు విడతల్లో ఇవ్వవలసిన బియ్యం ఒకే దఫలా పంపిణీ చేశాం. ఈ నెల 1న తేదీ నుండి యుద్ధ ప్రాతిపదికన రేషన్ పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 87,54,049 రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపు 79 లక్షల (91%) మంది బియ్యం తీసుకున్నారు. ఇందుకు మొత్తం 3.10 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం సరఫరా చేశాం. మార్చి నెలతో పోల్చితే ఇప్పటి వరకు 7% మంది అధికంగా రేషన్ తీసుకున్నారు.` అని వివ‌రించారు.

 

తెలంగాణ రాష్ట్రంలో 3.35 లక్షల మంది వలస కార్మికులను గుర్తించిన‌ట్లు మారెడ్డి తెలిపారు. ``ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం చొప్పున మొత్తం రూ. 13 కోట్లు విలువ చేసే 4028 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, అలాగే రూ. 500 నదగును పంపిణీ చేస్తున్నాం. దీనికి మొత్తం రూ. 30 కోట్లు ఖర్చవుతోంది.  పేదవాన్ని ఆదుకునే విషయంలో మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. దేశంలోనే మేం మొదటి వరుసలో ఉంటాం.ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు 13 లక్షల మంది పోర్టబిలిటీ ద్వారా రేషన్ బియ్యం తీసుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల రూ. 1500 నగదు అందని వారికి అందించే ప్రయత్నాలు చేస్తున్నాం.`` అని వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: