తెలంగాణ‌లో లాక్ డౌన్ విష‌యంలో పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌లో మ‌రింత సీరియ‌స్‌గా స్పందిస్తున్నారు. అత్యవసరం లేకున్నా వాహనాలపై బయట తిరుగుతున్న వాళ్ళను జైలుకు పంపిస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. లాక్ డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు సహకరిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతామని సీపీ అంజ‌న్‌కుమార్‌ అన్నారు. 99% మంది ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తున్నారని, 1% మాత్రమే ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. అలాంటి వాళ్ళవల్ల ఇన్ని రోజుల కష్టం వృధా అవుతుందని హెచ్చరించారు. 

 

లాక్ డౌన్ స‌మ‌యంలో పిల్లలు బయటికు రాకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ అంజ‌న్ కుమార్‌ కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి పంపించవద్దని కోరారు. ఎమర్జెన్సీ సర్వీసులు కొనసాగుతున్నాయని, ప్రజల సౌకర్యం కోసం ఆ ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలీసులు 24 గం. లు కరోనా విధులు నిర్వర్తిస్తున్నారని వాళ్లకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 18 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. 3500 పిటీ కేసులు, నిబంధనలు ఉల్లంఘించిన వివిధ సంస్థలపై 182 కేసులు నమోదు చేశామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 17 వేల మందిపై ట్రాఫిక్ విభాగం కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు 2724 వాహనాలను సీజ్ చేశామన్నారు.

 

కాగా, లాక్ డౌన్ కారణంగా పట్టణాల్లో, నగరాల్లో అన్ని పనులకు బ్రేక్ పడింది. కానీ పల్లెల్లో మాత్రం లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూనే వ్యవసాయ, ఇతర పనులు చేసుకుంటున్నారు. సోషల్ డిస్టెన్స్ నిబంధనను పాటిస్తూనే మిర్చి తోటలను ఏరుతున్నారు. ఊర్లోని వ్యక్తిగత అవసరాలకు మట్టి తోలించుకోవడం, పశువులను మేపడం, వరి పొలాలను కోయించడం, కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించడం, ఎండు మిర్చిలో తాలు కాయలను కూలీలతో ఏరించడం, ఇలా అన్ని పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తప్పనిసరి కావడంపై కూడా గ్రామాల్లో డప్పు చాటింపు వేయించడంతో అది కూడా అమలు జరుగుతోంది. గ్రామాల్లో లాక్ డౌన్ అమలవుతున్న తీరు అధికారులనే ఆశ్చర్యపరుస్తోంది. పట్టణాల కంటే గ్రామ ప్రజల్లోనే కరోనాపై చైతన్యం కనిపిస్తోందని అధికారులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: