ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నత విద్యా వ్యవస్థలో సాంకేతిక పరమైన సంస్కరణలకు రంగం సిద్ధమైంది. వాటిని అమలు చేసేందుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. ఇక  రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు , అనుబంధ ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో అంతా ఆన్‌ లైన్ ద్వారానే విద్యా, పాలనా పరమైన అంశాలను నిర్వహిస్తారు. 

 

 

ఉన్నత విద్యలోనూ ఆన్‌ లైన్ అడ్మిషన్లు రాబోతున్నాయి. అంతే కాదు.. ఉన్నత విద్యకు సంబంధించి ఓ రియల్ టైమ్ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు ఏపీ సీఎఫ్ఎస్ఎస్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది. మెరుగైన సేవలందించేందుకు గానూ అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో  ఆటోమేషన్ ప్రక్రియను తప్పని సరి చేస్తూ మార్గదర్శకాలు ఇచ్చారు. సాంకేతిక పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఇ-గవర్నెన్సు విధానాన్ని అమలు చేస్తున్నందున విద్యాసంస్థలూ ఈ మార్గాన్ని అనుసరించాలని స్పష్టం చేస్తూ  ఆదేశాలు  ఇచ్చింది. 

 

 

 

దీని ప్రభావం వల్ల అండర్ గ్రాడ్యుయేట్ , పీజీ కోర్సులు, పీహెచ్డీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియతో పాటు , సెమిస్టర్ల పరీక్షా ప్రక్రియ మొత్తాన్ని ఆటోమేషన్ చేస్తారు. పరీక్షా ఫలితాలు, డిగ్రీ పట్టాల జారీ , మార్కుల మెమోల జారీ తదితర అంశాలను కూడా  డిజిటల్ విధానంలో ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు అనుబంధ కళాశాలలు అందించే కోర్సులు, విద్యా ప్రమాణాలు, ఇతర కీలకమైన అంశాలకు సంబంధించి ఒకటే రియల్ టైమ్ డాష్ బోర్డు ఉంటాయి.

 

 

 

ఇంకా కళాశాలల పాలన, నిర్వహణా పరంగా ప్రతీ విద్యా సంస్థా ఎలక్ట్రానిక్ ఎం-బుక్ ను నిర్వహిస్తారు. విద్యా  సంస్థకు సంబంధించిన ప్రాజెక్టు వర్కులు, కీలకమైన మైలు రాళ్లు, ఇతర ఇండికేటర్లను సూచిస్తూ ఎంబుక్ నిర్వహించాలని ఆదేశాల్లో ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు సంబంధించి ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ , సర్వీసెస్ ఏపీ సీఎఫ్ఎస్ఎస్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుందని  ఉన్నత విద్యాశాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: