కర్నూలు నగరం భయం గుప్పిట్లో ఉంది. రోజు రోజుకు కర్నూలు సిటీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జనం భయపడిపోతున్నారు. ఇప్పటికే కర్నూలులో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కరోనా వైరస్ ఎంత వరకు వ్యాపిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కొన్నాళ్లుంటే లాక్ డౌన్ ఎత్తేస్తారనుకుంటున్న తరుణంలో.. పెరుగుతున్న కరోనా కేసులు మరింత భయపెడుతున్నాయి. 

 

కర్నూలు నగరంలో 6 లక్షల జనాభా. కరోనా వైరస్ వ్యాపిస్తున్న దశలో మొదట ఒక్క పాజిటివ్ కేసు కూడా కర్నూలులో లేదు. అయితే ఈమధ్య కాలంలో ప్రతి రోజు గంపగుత్తగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చిపడుతున్నాయి. పదుల సంఖ్యలో పెరుగుతున్నాయి. ఒకే రోజు 10, 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మర్కజ్ వెళ్లి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో కరోనా పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు 115 పాజిటివ్ కేసులు ఉంటే అందులో 113 ఢిల్లీకి వెళ్లిన వారు, వారి కాంటాక్టులవే. కర్నూలు నగరంలో ఇప్పటి వరకు 50 పాజిటివ్ కేసులు ఉండగా అన్నీ కూడా ఢిల్లీతో లింకులున్నవే. కరోనా పాజిటివ్ ఉన్న వారికి తెలీకుండా వైద్యం చేసి ఓ ప్రముఖ వైద్యుడు కూడా బలయ్యాడు. ఇప్పటికే కర్నూలు సిటీలో 50 కేసులు నమోదు కాగా వారి కాంటాక్ట్స్ ఎన్ని నమోదు అవుతాయోనన్న ఆందోళన ప్రజల్లో ఉంది. పేదల వైద్యునిగా పేరున్న వ్యక్తి కరోనా పాజిటివ్ తో మృతి చెందడంతో ఆయన వద్ద చికిత్స పొందిన వారిలో ఎంత మందికి సోకిందో అన్న భయం కూడా ఉంది. 

 

కర్నూలు నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో రెడ్ జోన్ ఏరియాలు కూడా పెరిగాయి. నగరంలో 80 శాతం వరకు ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలోకి వచ్చాయి. ప్రతిరోజు ఆయా ప్రాంతాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు వస్తున్నాయన్న సమాచారంతో జనం భయపడుతున్నారు. ఏ కాలనీకి వెళ్లినా మూసివేసిన రహదారులే దర్శనమిస్తున్నాయి. దాదాపు సిటీ అంతా స్మశాన వాతావరణం ఉంది. ప్రతివాళ్లనూ అనుమానించే పరిస్థితి ఉంది. కర్నూలు సిటీలో చిత్తారి వీధి, గనిగల్లీ, కుమ్మరి వీధి, మండిబజార్, ఉస్మానియా కాలేజీ రోడ్, బొంగుల బజార్, కడక్ పుర, షరాఫ్ బజార్, నేతాజీ నగర్, మించిన్ బజార్, జొహరాపురం, వడ్డెగేరి, ప్రకాష్ నగర్, రోజా వీధి, ఎన్ ఆర్ పేట, నరసింహారెడ్డి నగర్, కొత్తపేట, బుధవారపేట, రెవెన్యూ కాలనీ....ఇలా అన్ని ప్రాంతాలూ రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఆర్టీసి బస్టాండు నుంచి నంద్యాల చెక్ పోస్టు వరకు మెయిన్ రోడ్డు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాలన్నీ దాదాపుగా రెడ్ జోన్లుగా ఉన్నాయి. 

 

కర్నూలు సిటీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో రాబోయే రోజులు ఎలా ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 50 కేసులు పాజిటివ్ వచ్చాయని, జిల్లా మొత్తం 115 కేసులు నమోదయ్యాయని భయపడుతున్నాయి. ఇంకా వెయ్యికి పైగా రిపోర్టులు రావాల్సి ఉండగా వాటిలో ఎన్ని పాజిటివ్ ఉన్నాయో, వారి నుంచి ఎంత మందికి సోకిందోనని భయపడుతున్నారు జనం. ఇళ్లలో పిల్లలను పట్టుకోలేక, బయటికి వెళ్తే ఎవరి నుంచి కరోనా సోకుతుందోనని ఆందోళనతో ఉన్నారు. కొందరు నిత్యావసర సరుకులు కోసం బయటికి వెళ్లాలన్నా భయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: