సీనియర్ యాంకర్ ఉదయభాను ఒన్స్ మోర్ ప్లీజ్ అనే ఓ బుల్లితెర కార్యక్రమం ద్వారా చాలా పాపులర్ అయ్యారు. ఆమె తన కెరీర్ లో ఎన్నో ప్రోగ్రాములలో వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టడంతో పాటు... సినిమాలలో కూడా అడపాదడపా నటించారు. ప్రస్తుతం బుల్లితెర పై అంతగా కనిపించని ఆమె సౌకర్యవంతమైన జీవితాన్నే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక జరగకూడని సంఘటన జరిగి ఆమెను శోకసంద్రంలోకి నెట్టివేసింది. నిన్న సాయంత్రం దేవుడిచ్చిన తన సొంత చెల్లి అర్ధాంతరంగా ప్రాణాలు విడిచింది.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... పాత నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లోని ఖుదాభక్ష్‌పల్లె గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ కలిసిన నీటిని తాగి ఫ్లోరోసిస్ మహమ్మారి బారిన పడ్డారు. ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చిన వారికి ఎముకలు వంగిపోతాయి, కాళ్లు చేతులు మెలికలు తిరిగిపోతాయి. అలాగే వారిలో వయసుకు తగ్గట్టు బరువు, ఎత్తు పెరగకుండానే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అయితే 2014వ సంవత్సరంలో 'నిగ్గతీసి అడుగు' అనే ఒక స్పెషల్ బులిటెన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఖుదాభక్ష్‌పల్లె గ్రామానికి వెళ్ళిన యాంకర్ ఉదయభాను కి రజిత అనే ఒక ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తురాలు పరిచయమయ్యింది.


ఆ యువతి మాట్లాడుతూ... ఫ్లోరైడ్ నీటిని తాగీ, తాగీ తాము అలా మారిపోయామని వివరంగా చెప్పి ఉదయభాను కళ్ళనుండి కన్నీళ్లు తెప్పించింది. దాంతో బాగా చలించిపోయిన ఉదయభాను రజిత ని తన చెల్లిగా దత్తత తీసుకున్నారు. అనంతరం ఒక లక్షా 40 వేల రూపాయలు ఖర్చు చేసి రజిత జీవనం కోసం ఒక కిరాణా షాపు ని ఓపెన్ చేయించారు. తన సొంత కారులోనే ముడిసరుకులను తెచ్చి మరీ రజిత యొక్క కిరాణా షాపు మొత్తం నింపేసారు. ఆ తర్వాత కూడా ఉదయభాను రజితకు తరచూ ఫోన్ చేస్తూ మంచిచెడులు కనుక్కునేవారు. రజితకు కూడా ఉదయభాను అంటే చచ్చేంత ఇష్టం. ఉదయభాను పెళ్లి సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా, పిల్లాడు పుట్టిన సందర్భంగా ఇలా ఆమె జీవితంలో జరుగుతున్న ప్రతి శుభ సందర్భంలో మొట్టమొదటిగా రజిత ముగ్గులు వేసి విషెస్ చెప్పేది.


కానీ గురువారం నాడు ఫ్లోరోసిస్ వ్యాధి కారణంగా రజిత ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆమె తన 30 ఏళ్ల వయసులోనే ప్రాణాలు విడిచింది. ఇది తెలుసుకున్న ఉదయభాను ఒక్కసారిగా నిర్ఘాంతపోయి శోకసంద్రంలో మునిగిపోయారు. తర్వాత తేరుకున్న ఆమె తన ఫేసుబుక్ పోస్ట్ లో రజిత ఇక లేదని తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. నిస్వార్ధమైన మానవాళి కారణంగా రజిత లాంటి ఎంతో మంది అమ్మాయిలు ఫ్లోరోసిస్ వ్యాధి కి ఆహుతి అవుతున్నారని ఆమె మండిపడ్డారు.


ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండగా... రజిత అంత్యక్రియల కార్యక్రమంలో కేవలం కొంతమంది బంధుమిత్రులే పాల్గొన్నారు. ఏది ఏమైనా ఉదయభాను లో ఇంత మంచి కోణం ఉందని ఇప్పటి వరకు ఎవరికీ తెలిసి ఉండదు. రజిత తనకు దేవుడిచ్చిన సొంత చెల్లి గా భావించినప్పటికీ... ఆ దేవుడే ఆమెను ఫ్లోరోసిస్ వ్యాధి నుండి కాపాడలేకపోయాడు.






మరింత సమాచారం తెలుసుకోండి: