ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాద్యమాన్ని ఖచ్చితం చేస్తూ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో 81, 85ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. స్కూళ్లలో ఏ మీడియం చదవాలనేది పిల్లలు, తల్లిదండ్రులు నిర్ణయిస్తారని పిటిషనర్ తరపున లాయర్ వాదించారు. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తే బ్యాక్‌లాగ్‌లు మిగిలిపోతాయని అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు... ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రాథమిక హక్కుకు భంగం కలిగించేలా ఉందని హైకోర్టు అభిప్రాయపడినట్టు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.

 

ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తూనే... తెలుగు మీడియం ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంది. భవిష్యత్తులో విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని వాదించింది. 

 

హైకోర్టు నిర్ణయంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. పేదలకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అందించాలన్న నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత తాము అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, 85 లను రద్దు చేస్తూ హైకోర్టు ప్రకటించిన అంశాలను కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు. 

 

ఇంగ్లీషు మీడియంపై కోర్టు తీర్పు అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలకు కారణమవుతోంది. అసలు ఇంగ్లీష్ మీడియంపై బీజేపీ కేసులు వేస్తే.. వైసీపీ నేతలు టీడీపీపై పడి ఏడుస్తున్నారంటూ టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘ఇంగ్లీష్ మీడియంపై కేసులు వేసింది బీజేపీ నాయ‌కులైతే తెలుగుదేశంపై ప‌డి ఏడుస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. కేసు వేసిన‌ బీజేపీ వాళ్ల‌ని ఏమ‌న్నా అంటే ఏ1, ఏ2ల బెయిల్ ర‌ద్ద‌యి జైలులో కూర్చుంటామ‌నే భ‌య‌మా?’’ అని కాల్వ శ్రీనివాసులు ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: