తెలంగాణలో ఇప్పుడు చ‌ర్చంతా క‌రోనా వైర‌స్ వ్యాప్తి గురించే.  ఇప్ప‌టికే పాజిటివ్ వ‌చ్చిన వారి గురించి...అస‌లు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని జిల్లాల గురించి ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రోవైపు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జ‌రిగిన మర్కజ్ ప్రార్థ‌న‌లకు వెళ్లి వ‌చ్చిన వారు, వారి నుంచి సంక్ర‌మించిన తీరు గురించి ఆందోళ‌న చెందుతున్నారు. వీరి విష‌యంలో తాజాగా కీల‌క విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సాక్షాత్తు తెలంగాణ‌ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మ‌ర్క‌జ్‌కు వెళ్లి వ‌చ్చిన వారిలో దాదాపు 20 కుటుంబాలు మర్కజ్‌ వెళ్లి వచ్చినవారివే ఉన్నాయని, నిర్ధారణ పరీక్షలు చేయించుకొనేందుకు ఇంకా చాలామంది ముందుకురావడం లేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

 


మర్కజ్‌ వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి వల్ల 20 మంది కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ తెలిపారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసి కూడా వారిని కలిసిన వారు పరీక్షలకు ముందుకు రావడం లేదని మంత్రి పేర్కొన్నారు. క‌రోనా వైరస్‌ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. ఇండోనేషియాకు చెందిన వాళ్లు కరీంనగర్‌లో ఇంటింటికీ తిరిగినా కరోనా సోకలేదని, అధికారుల వ్యూహం వల్ల కరోనా విస్తరించలేదని మంత్రి రాజేందర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ తరహాలో హైదరాబాద్‌లోనూ కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా నిర్ణయించి, వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం దృష్టి సారించింద‌ని మంత్రి తెలిపారు.

 

జలుబు, దగ్గు, తుమ్ములు లేకుండానే కేసులు నమోదయ్యాయని, ఇందుకు అనుగుణంగానే పాజిటివ్‌ వ్యక్తులతో కాంటాక్ట్‌ అయిన అందరికీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 10 వేల మందికి క‌రోనా నిర్ధారణ పరీక్షలు చేశామని, గురువారం ఒక్కరోజే 800 మందికి పరీక్షలు నిర్వహించామని, ఇందులో 90శాతం మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారేనని మంత్రి ఈట‌ల‌ స్పష్టం చేశారు. కొత్తగా 50 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 700లకు చేరిందని చెప్పారు. తెలంగాణ‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారిలో 68 మందికి నెగెటివ్‌ వచ్చిందని, వారిని త్వరలోనే డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. పాజిటివ్‌ కేసుల్లో ముగ్గురు వెంటిలేటర్‌పై ఉన్నారని, మిగతావారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసులు ఒకరోజు ఎక్కువగా.. మరొకరోజు తక్కువగా నమోదవుతున్నాయని మంత్రి ఈటల తెలిపారు. చికిత్స పొందుతున్నవారు కోలుకొని డిశ్చార్జి అవుతున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: