ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. కరోనా మీద అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే మరోవైపు నిమ్మగడ్డ వ్యవహారం మీద కూడా రాజకీయం నడుస్తుండగానే, ఇంగ్లీష్ మీడియం విషయం తెరమీదకొచ్చింది. ప్రతి పేద పిల్లోడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం 1 నుంచి 6 తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉండాలని జీవో తీసుకొచ్చింది.

 

అయితే దీనిపై ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి కాదని చెబుతూనే, విద్యార్థులకు, తల్లితండ్రులకు ఏ మీడియంలో చదవాలనే ఆప్షన్ ఇవ్వాలని చెప్పింది. ఇక దీనిపై వైసీపీ నేతలు, టీడీపీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం టీడీపీకి ఇష్టం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఇంగ్లీష్ మీడియం ఈ రెండు పార్టీల మధ్య చాలారోజులు మాటల యుద్ధం జరిగింది. అప్పుడు వైసీపీ ఇలాగే ఆరోపణలు చేస్తే టీడీపీ నేతలు, చంద్రబాబు కౌంటర్ కూడా ఇచ్చారు. ఇక మళ్ళీ ఇంకొకసారి టీడీపీ నేతలు వైసీపీ ఆరోపణలపై ఘాటుగానే స్పందిస్తున్నారు.

 

అసలు తమ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని, ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వ్యతిరేకించడంలేదని చెబుతున్నారు. కాకపోతే నిర్బంధ విద్యని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని, ఏ మీడియంలో చదవాలనేది విద్యార్థులకు ఆప్షన్ ఇవ్వాలని చెబుతున్నామని, ఇప్పడు అదే కోర్టు కూడా చెప్పిందని అంటున్నారు. పైగా కోర్టులో కేసు వేసింది కూడా బీజేపీ నేత అని, దమ్ముంటే వాళ్ళ మీద విమర్సలు చేయాలని, అలా కాకుండా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన తమ మీద కాదని వైసీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు.

 

అయినా పిల్లలకు ఆప్షన్ ఇవ్వమంటే, బుద్ధి లేకుండా అసలు ఇంగ్లీష్ మీడియం తాము వ్యతిరేకిస్తున్నామని ఎలా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రజలంతా ఇది గమనిస్తున్నారని, ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: