ఏపీ అభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు రాజధానులపై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఇక ఆ రచ్చ జరుగుతుండగానే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఇక ఈలోపు కరోనా మహమ్మారి ఎంట్రీ ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మూడు రాజధానులు అంశం పక్కకువెళ్లిపోయింది.

 

ప్రస్తుతం అంతా కరోనాపైనే నడుస్తోంది. ఇదే సమయంలో కరోనాతో లింక్ రాజధాని విషయంపై రచ్చ జరుగుతుంది. కరోనాని అడ్డంపెట్టుకుని వైసీపీ రాజధాని తరలించే కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కరోనా కేసులు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని, కాకపోతే విశాఖలో కరోనా కేసులు ఉన్నా, వాటిని దాచిపెడుతున్నారని అంటున్నారు.

 

ఇక దీనికి ఊహించని లింకులు కూడా చెబుతున్నారు. కరోనా లక్షణాలున్నవారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారని, దీనిపై తక్షణమే కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ కమిషనర్‌ను షాడో సీఎం విజయసాయి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వీరి ఆరోపణల సమయంలోనే విజయసాయిరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా విశాఖలో కరోనా కేసులు తగ్గిస్తున్నారని అనడానికి ఉదాహరణగా ఉన్నాయంటున్నారు.  విశాఖలో కరోనా కేసులు తగ్గుతున్నాయని విజయసాయి చెప్పిన మాటల వెనుక పెద్ద మతలబు ఉందని అంటున్నారు. పైగా ఓ స్వామిజీ చెప్పినట్లుగా జగన్ రాజధాని తరలింపు ప్రక్రియ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

 

ఇదే సమయంలో టీడీపీ నేతలు చేసే ఆరోపణలకు వైసీపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. అసలు జగన్ ప్రస్తుతం కరోనాని కట్టడి చేసే పనిలో బిజీగా ఉన్నారని, పరిస్థితి అంతా చక్కదిద్దాక రాజధాని తరలింపుపై దృష్టి పెడతారని, అంతేగానీ ఇలా కరోనాని అడ్డం పెట్టుకుని రాజధాని తరలింపు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఒకవేళ అదే అనుకుంటే కర్నూలులో కూడా కరోనా కేసులు తక్కువ ఉండాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు  కరోనాని దాచిపెట్టడం ఎవరి వల్ల కాదని, కాబట్టి టీడీపీ నేతలు పనికిమాలిన విమర్శలు చేయడం మానుకోవాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: