దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య 14,000కు చేరగా మృతుల సంఖ్య 450 దాటింది. మొదట ప్రధాని మోదీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను ప్రకటించగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ఇటీవల ప్రకటన చేశారు. మోదీ లాక్ డౌన్ ను మరోసారి పొడిగించడంతో మే 3 తరువాత కూడా లాక్ డౌన్ ను పొడిగిస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి.  
 
కొందరు మే 24 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తారని... మరికొందరు మే 30 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తారని ప్రచారం చేస్తున్నారు. మరి ఈ వార్తలు నిజమేనా...? అనే ప్రశ్నకు చెప్పలేం అనే సమాధానం వినిపిస్తోంది. మే 3వ తేదీలోగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గకపోతే లాక్ డౌన్ ను మరోసారి పొడిగించినా ఆశర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మే 1వ తేదీ వరకు దేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. 
 
మరోవైపు లాక్ డౌన్ పై కూడా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో కరోనా విజృంభణ తగ్గే వరకు లాక్ డౌన్ ను కొనసాగించాలని కొందరు చెబుతుంటే.... మరికొందరు మాత్రం కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాలలో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని కోరుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతూనే లాక్ డౌన్ ఆంక్షలపై సడలింపులు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు వల్ల చాలామంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వారు ఇతర రాష్ట్రాల్లో తాము ఇబ్బందులు పడుతున్నామని సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పేదలు, దినసరి కూలీలు ఆకలితో అలమటిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులను చూడలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: