కనిపించని శత్రువును పట్టకుని జైల్లో వేయలేం.. అయినా సరే ఏ శత్రువుతో పోరాటంలో పోలీసులు ముందు వరుసలో నిలుస్తున్నారు. చావు ముందు నిలబడి దేశ ప్రజలను కరోనా బారిన పడకుండా కాపాడుతున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో కొందరు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. 

 

వైరస్‌ను అడ్డుకోవడంలో వైద్యులు ఎంతగా శ్రమిస్తున్నారో పోలీసులు కూడా రోడ్లపై అంతే శ్రమిస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా ఉంది. లాక్‌డౌన్‌లో ప్రజలెవరూ రోడ్లమీదకు రాకుండా పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారు. అంతేకాదు, వైరస్ సోకిన వారిని గుర్తించడం, వారితో కలిసి మెలిసి తిరిగిన వారిని గుర్తించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారుతోంది. మర్కాజ్ ప్రార్ధనలకు వెళ్లొచ్చిన వారిని గుర్తించి, వారి ఇళ్లకు వెళ్లి... ఆసుపత్రులకు తరలించే క్రమంలో కొందరు పోలీసులు కూడా వ్యాధి బారిన పడ్డారు. హైదరాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు కరోనా సోకడం తీవ్ర కలకలం రేపింది. ఆయనతో పాటు 14మందిని క్వారంటైన్‌కు పంపించారు. 

 

తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ పోలీసులు కరోనా బారిన పడ్డారు. పంజాబ్ ‌ లూథియానాలో ఎస్‌ఐకి కరోనా సోకింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఢిల్లీలో కూడా ముగ్గురు పోలీసులకు కరోనా పాజిటీవ్ అని తేలింది. దీంతో డీసీపీ సహా అతనితో పనిచేస్తున్న 30 మంది పోలీసులను క్వారంటైన్లోకి పంపించారు. ఢిల్లీలో మర్కజ్‌ ఆపరేషన్‌ చేసే సమయంలో పోలీసులు తీవ్రమైన రిస్క్‌ తీసుకున్నారు. మర్కజ్‌ బిల్డింగ్‌లో ఉన్నవారిని బలవంతంగా లాక్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాళ్లకు కరోనా సోకి ఉండవచ్చే అనుమానంతో టెస్టులు చేశారు. ఇప్పుడు వారిలో కొందరికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇక మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో మర్కజ్‌ యాత్రికులను పట్టుకున్న పోలీసులకు కూడా కరోనా సోకింది. ఒక ఎస్పీతో పాటు, సబ్‌ ఇన్స్‌ పెక్టర్‌ సహా ఎనిమిది మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటీవ్ అని తేలింది. వారంతా ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర థానేలోని ఓ పోలీస్‌ ఇన్స్‌ పెక్టర్‌కి కరోనా పాజిటీవ్‌ అని తేలింది. దీంతో 16 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులు, మొత్తం 23 మందిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

చైనా లాంటి దేశంలో సైతం 95 మంది పోలీప్ సిబ్బంది వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. మన దేశంలోనూ పోలీసులు వైరస్ బారిన పడుతున్నారు. కరోనాను ఎదుర్కోవడంలో ఫ్రంట్‌ లైన్‌లో ఉండి పనిచేస్తున్న పోలీసులు.. బాధితులుగా మారడం ఇప్పుడు అందరిని భయపెడుతోంది. తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీఈ కిట్స్ ఇవ్వాలని ఉన్నతాధికారులను పోలీసు సిబ్బంది కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: