తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌ నారా చంద్ర‌బాబు నాయుడ‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌ మండిప‌డ్డారు. చంద్ర‌బాబు చేస్తున్న కామెంట్ల‌పై స్పందించిన అమ‌ర‌నాథ్, చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన 40 ఏళ్ల పొలిటికల్ వైరస్ అని విరుచుకుప‌డ్డారు. ``కరోనా వైరస్  కొన్ని నెలల తర్వాత అయినా తగ్గుతుంది...చంద్రబాబు వైరస్ చాలా ప్రమాదకరం. చంద్రబాబు జనతా కర్ఫ్యూ రోజు మనవడికి ఇంగ్లీష్ బోధన చేస్తున్న వీడియో చూశాం...కానీ ఆయన మాత్రం రాష్ర్టంలో పేద విద్యార్దులకు ఇంగ్లీష్ మీడియం రాకుండా కుట్రలు చేశారు`` అని వ్యాఖ్యానించారు. 

 

క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై పోరాటంలో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ దీపాలు వెలిగించమన్న పిలుపును న‌రేంద్ర‌నాథ్ ఆస‌క్తిక‌రంగా విశ్లేషించారు. ``ప్ర‌ధాని దీపాలు వెలిగించాల‌ని కోరితే చంద్ర‌బాబు దీపం ప‌ట్టుకున్నారు. ఆయ‌న కొడుకు కొవ్వొత్తి, మనవడు టార్చ్ లైట్ పట్టుకున్నారు. మీ ఇంట్లోనే ఐక్యత లేదు, కానీ అఖిలపక్షం గురించి మీరు మాట్లాడతారు`` అని విరుచుకుప‌డ్డారు.

 

చంద్రబాబు చందాల గురించి మాట్లాడటం హాస్యాస్పదమ‌ని ఆరోపించారు. ``హుద్ హుద్ తుఫాన్ నుంచి రాజధాని నిర్మాణం వరకు చందాలు వసూలు చేసిన ఘనత మీదే చంద్ర‌బాబు. మిమ్మల్ని చందాల నాయుడు అని ఉంటే బాగుండేదేమో. మీరు, మీ పత్రికలు ఈనాడు, ఆంద్రజ్యోతి కూడా పలు సందర్భాలలో చందాలు వసూలు చేసి ఎపుడైనా లెక్కలు చెప్పారా? హుద్ హుద్ తుఫాన్ సమయంలో వెయ్యి కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని మీరు కోరితే 600 కోట్లు ఇస్తే...అందులో 200 కోట్ల రూపాయిలతో కూరగాయలు కొనుగోలు చేశామని మీ హోంమంత్రి అసెంబ్లీలో దొంగలెక్కలు చెప్పలేదా?`అని మండిప‌డ్డారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన గబ్బిలమ‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ``విశాఖలో కరోనా కేసులు దాచిపెడుతున్నామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేస్తున్నారు. అయ్యన్నకి మందు దొరక్క ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. విశాఖలో పాజిటివ్ కేసులు దాచాల్సిన అవసరం ఏముంది? మీ నాయకుడి మెప్పుకోసం విశాఖపై తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దు.`` అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: