ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లానికి కార‌ణ‌మైన చైనాలో సీన్ మారుతోంది. ఆ దేశంలో శ‌వాల లెక్క‌లు మారుతున్నాయి! కరోనా కేసుల వివరాలను చైనా దాచిపెడుతున్నదని పలుసార్లు అమెరికా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌లు కావ‌చ్చు...మ‌రేదైనా అంశం కార‌ణం అయి ఉండ‌వ‌చ్చు కానీ...కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్యలో, దీని వల్ల మరణించిన వారి సంఖ్యలో చైనా మార్పులు చేసింది. ప్రధానంగా వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్‌ నగరంలో మరణాలను దాదాపు 50 శాతం పెంచి చూపింది. ఇదే అవ‌కాశంగా తీసుకొని అమెరికాను ఆడుకుంటోంది.

 

కరోనా జ‌న్మ‌స్థాన‌మైన‌ వుహాన్‌లో ఈ వైరస్‌ వల్ల 2,579 మంది మరణించారని, 50,008 మంది ఈవ్యాధి బారి న పడ్డారని ఇటీవల చైనా ప్రకటించింది. అయితే తాజాగా ప్లేట్ ఫిరాయించి ఈ లెక్క‌ల‌ను మార్చింది. వుహాన్‌లో కరోనా వల్ల మొత్తం 3,869 మంది మరణించారని తెలిపింది. త‌మ‌ను తాము క‌వ‌ర్ చేసుకుంటూ...తాజాగా 1,290 మరణాల వివరాలు వెలుగులోకి వచ్చాయని, దీంతో ఈ సంఖ్య 3,869కి చేరిందని పేర్కొంది. అలాగే వైరస్‌ సోకినట్లు తాజాగా 325 మంది వివరాలు వెల్లడయ్యాయని, దీంతో ఈ సంఖ్య 50,333కు చేరిందని వివరించింది. ఈ వివరాలు సవరించడానికి గల కారణాలను కూడా ప్రస్తావించింది. వుహాన్‌లో వైరస్‌ విజృంభించడంతో చాలా మంది ఇళ్ల‌ల్లోనే చికిత్సపొందుతూ మరణించారని తెలిపింది. ఈ వివరాలు సకాలంలో అందకపోవడంతో తాము కూడా అప్పట్లో అందుబాటులో ఉన్న వివరాలనే ప్రకటించామని తెలిపింది. కానీ ఈ వివరాలు ఇప్పుడు ప్రభుత్వానికి చేరడంతో మార్పులు చేశామని వివరించింది.

 

అయితే, చైనా తీరుపై అగ్ర‌రాజ్యం అమెరికా ఘ‌టుగా స్పందించింది. కరోనా విషయంలో తొలి నుంచి చైనా త‌ప్పుడు లెక్క‌లు చెప్తోంద‌ని అమెరికా మరోసారి ధ్వజమెత్తింది. అమెరికాకు తోడు బ్రిటన్‌ కూడా గొంతు కలిపింది. క‌రోనా విష‌యంలో చైనా స‌రైన వివ‌రాలు చెప్పాల‌ని డిమాండ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: