ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈరోజు ఉదయం వరకు 129 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జిల్లాలో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. ఈరోజు జిల్లాలో కరోనా సోకిన వృద్ధుడు మృతి చెందాడు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఈ మేరకు ప్రకటన చేశారు. 
 
60 సంవత్సరాల వ్యక్తి కరోనాకు చికిత్స పొందుతూ మరణించాడని సమాచారం. జిల్లాలో కరోనాను కట్టడి చేయడానికి అధికార యంత్రాంగం లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తోంది. జిల్లాలోని హాట్ స్పాట్ కేంద్రాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. హాట్ స్పాట్ ప్రాంతాలలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలని కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 2,000 మంది నుంచి శాంపిళ్లు సేకరించి నమూనాలను పరీక్షలకు పంపారు. 
 
అధికార యంత్రాంగం ఎవరైనా కరోనా సోకిన వారితో సన్నిహితంగా ఉంటే వారు స్వచ్ఛందంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో క్వారంటైన్ కేంద్రాలకు, ఐసోలేషన్ వార్డులకు రావాలని అప్పుడే వైరస్ ను నియంత్రించడం సాధ్యం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
హాట్ స్పాట్ కేంద్రాల్లోకి బయటివారిని ఎవరినీ అనుమతించడం లేదని చెప్పారు. నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల వల్ల ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. జిల్లాలో కర్నూలు కార్పొరేషన్, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూర్, డోన్, బేతంచెర్ల, బనగానపల్లె, పాణ్యం, కోడుమూరు, చాగలమర్రి, గడివేముల, శిరివెళ్ల, నంద్యాల, నందికొట్కూరు, ఓర్వకల్లు, అవుకు, రుద్రారం, సంజామలా ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: