గత కొన్ని రోజులుగా చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి కరోనా అసలులెక్కలు, వాస్తవాల విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత గురించి ప్రపంచాన్ని హెచ్చరించే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర జాప్యం చేసిందని పలు దేశాల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డబ్ల్యుహెచ్‌ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 
 
అనంతరం డబ్ల్యుహెచ్‌ఓకు నిధులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో 194 దేశాలు, 430 సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. చికిత్సలు, ఔషధాలు, పరిశోధనలు డబ్ల్యుహెచ్‌ఓ బాధ్యతల్లో కీలకమైనవి. కరోనా విషయంలో డబ్ల్యుహెచ్‌ఓ పక్షపాతంతో నడుచుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనా కూడా బాధితుల, మృతుల విషయంలో కొత్త లెక్కలు చెబుతూ ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
తైవాన్ కరోనా గురించి తాము గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం ఇచ్చామని.. కానీ ఆ సంస్థ స్పందించలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. తైవాన్ ఇందుకు సంబంధించిన ఈ మెయిల్ ను బయటపెట్టింది. దీంతో ప్రపంచ దేశాల ముందు డబ్ల్యుహెచ్‌ఓ దోషిగా నిలబడింది. తైవాన్ బయటపెట్టిన మెయిల్ ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ కనీస బాధ్యతలను విస్మరించిందని తేలింది. 
 
చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థల నిర్లక్ష్యం వల్లే నేడు ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా భారీన పడ్డాయి. మరి తైవాన్ బయటపెట్టిన లేఖపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ నుంచే కరోనా వ్యాప్తి జరిగినా మార్చి 11 వరకు కరోనా మహమ్మారి అని గుర్తించలేకపోయింది. ఎవరు డబ్ల్యుహెచ్‌ఓపై ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు కరోనా నుంచి బయటపడటమే ప్రధానం. అన్ని దేశాలు ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడకుండా ముందడుగులు వేస్తే మాత్రమే కరోనా నియంత్రణ సాధ్యమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: