బంగారం నేలచూపులు చూస్తోంది. అడ్డూఅదుపు లేకుండా పెరిగిన పసిడి ధర ఇప్పుడు రికార్డు స్థాయిలో పతనమవుతోంది. నిన్న ఒక్క రోజే భారీగా దిగొచ్చింది. కరోనా ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా.. ఏమాత్రం తగ్గని పుత్తడి ధర రెండ్రోజులుగా తగ్గుతూ వస్తోంది.

 

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి... అంతర్జాతీయ  మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. స్టాక్‌ మార్కెట్లలో నిమిషాల వ్యవధిలో లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. బంగారం ధరలు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా పెరిగాయి. కరోనా ప్రభావం పెరిగినా.. పుత్తడి ధర పరుగులు పెట్టింది.  ఏప్రిల్‌ మొదటివారంలో 43 వేల 900 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర వారం వ్యవధిలోనే 45 వేల 970 రూపాయలకు చేరుకుంది. 7 రోజుల్లోనే 2 వేల రూపాయలకుపైగా పెరిగింది. 

 

రెండు రోజులుగా బంగారానికి బ్యాడ్‌ టైం నడుస్తోంది. ధర భారీగా పతనమవుతూ వస్తోంది. నిన్న ఒక్క రోజే 10 గ్రాముల బంగారంపై 1680 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్‌ 44 వేల 200 రూపాయలుండగా... 22 క్యారెట్ల గోల్డ్‌ 40 వేల 510 రూపాయలుగా ఉంది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కి పాల్పడటంతో పాటు... ఎంసీఎక్స్‌ మార్కెట్లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ధర ఏకంగా 1.95 శాతం క్షీణించింది. 

 

వెండి కూడా పుత్తడి బాటలోనే పయనిస్తోంది. వెండి ఫ్చూఛర్స్‌ ధర 1.65 శాతం తగ్గింది. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు లాభపడటంతో పుత్తడికి డిమాండ్‌ బాగా తగ్గింది. ద్రవ్యోల్భణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపాయి. 

 

మరికొన్ని రోజులపాటు బంగారం ధరల్లో తగ్గుదల ఉండొచ్చని.. వెండి కూడా మరింత తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: