కరోనా ఆంక్షల మధ్య రంజాన్‌ మాసం ప్రారంభం కానుంది. ముస్లింలు పవిత్రంగా భావించే ఉపవాస దీక్షలు మరో వారం రోజుల్లో  మొదలవుతాయి. దీంతో మసీదులను మూసివేసి ఉంచాలని, సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్‌ విందులను రద్దు చేయాలని ఆదేశిస్తూ గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది కేంద్రం. 

 

రంజాన్ మాసం అనగానే కఠిన ఉపవాస దీక్షలు, ప్రత్యేక సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్‌ విందులు. ఇక హైదరాబాద్‌లో చార్మినార్‌ దగ్గర నైట్‌ బజార్‌, నోరు ఊరించే హలీం గుర్తుకు వస్తాయి. కానీ కరోనా కరాళ విజృంభిస్తున్న  ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సారి రంజాన్ కళ తప్పనుంది. ఓ వైపు వైరస్‌ వస్తుందోననే ఆందోళన, మరోవైపు ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన వేలాది కుటుంబాల ఆవేదన మధ్య రంజాన్‌ నెల సాగనుంది.  

 

నెల వంక కనిపించే రోజును బట్టి ఈ నెల 24 లేదా 25 నుంచి ఇదుల్‌ ఫితర్‌ ప్రారంభం అవుతుంది. పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం కోసం ముస్లింలంతా ఎదురు చూస్తుంటారు. రంజాన్‌ నెలలో రోజుకు ఐదు సార్లు నమాజు చేయడంతో పాటు, కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఖురాన్ పఠనం, అల్లా ప్రార్థనలోనే ఎక్కువ సమయం గడుపుతారు. 

 

మిగతా రోజుల్లో నమాజు కోసం మసీదులకు వెళ్లని వాళ్లు కూడా రంజాన్‌ మాసం కచ్చితంగా వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత చేసే తరాబీ నమాజుకు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఇక సాయంత్రం ఉపవాస దీక్ష విరమించే ఇఫ్తార్‌ ఈ నెల రోజులూ ప్రత్యేకమే. మతాలకు, వర్గాలకు అతీతంగా అందరూ ఈ ఇఫ్తార్ విందుల కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తుంటారు. 

 

రంజాన్‌ మాసంలో కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉండడంతో కేంద్రం ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడం వల్ల మసీదులను మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వక్ఫ్‌ బోర్డులకు ఆదేశాలు పంపింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా సర్క్యులర్‌ జారీ చేసింది. రంజాన్‌ ప్రారంభమైనా... మసీదుల్లో సామూహిక నమాజులు చేయవద్దని స్పష్టం చేసింది. అలాగే, ఇఫ్తార్‌ విందులను నిషేధించింది. ఈ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మసీదు, మత పెద్దలకు సూచించడంతో పాటు కింది స్థాయి వరకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. 

 

మొత్తానికి కరోనా ప్రభావం వల్ల రంజాన్‌ ఉపవాస దీక్షలు, నమాజులను ముస్లింలు ఇళ్లల్లోనే కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: