దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 15,000కు చేరువలో ఉంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో కరోనా పేరు వింటే చాలు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు మందు కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. మరి కరోనాకు మందు కనిపెట్టారా అనే ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. 
 
అమెరికాకు చెందిన యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్నో పరిశోధనలు చేసి ‘రెమ్‌డెసివిర్’ అనే మందు కనిపెట్టింది. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ మందు కరోనాను నియంత్రించడానికి సమర్థవంతంగా పని చేయగలదని తేలింది. శాస్త్రవేత్తలు దాదాపు 12 కోతులపై ప్రయోగం చేసి ఈ విషయాలను వెల్లడించారు. శాస్త్రవేత్తలు కోతులను రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూపుకు ‘రెమ్‌డెసివిర్’ మందును ఇచ్చారు. 
 
ఈ మందు ప్రయోగించిన 12 గంటల తర్వాత చేసిన పరీక్షల్లో కోతుల్లో కరోనా వైరస్ చాలా వరకు తగ్గిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మందు ప్రయోగించని కోతులతో పోలిస్తే ప్రయోగించిన కోతుల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెప్పారు. మందు ప్రయోగించిన కోతుల్లో ఊపిరితిత్తులు కూడా పెద్దగా పాడవ్వలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు ఈ మందును మనుషులపై ప్రయోగించాల్సి ఉంది. 
 
మనుషులపై ప్రయోగం అనంతరం శాస్త్రవేత్తలు మందును మార్కెట్లోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇతర దేశాల్లో కూడా కరోనాకు మందును కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. పలు దేశాల్లో ఇప్పటికే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కరోనాకు మందు అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుంది. కరోనాకు మందు లేకపోవడం వల్లే రోజురోజుకు బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది.  వ్యాక్సిన్ మాత్రమే కరోనాకు పరిష్కారమని ప్రపంచ దేశాలు అన్నీ భావిస్తున్నాయి. జూన్ నెల చివరి వారంలోపు కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: