పసిపాపల నుండి పండు ముసలి వరకు ఎవర్నీ వదలకుండా కొనసాగుతున్న కరోనా పంజాతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇప్పటి వరకు పట్టణాలను కుదిపేసిన ఈసమస్య ఇప్పుడు పల్లె ప్రాంతాలకు కూడ విస్తరించింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో కరోనా భయంతో చాలామంది తమ ఇంటిముందు ‘దయచేసి ఎవరు ఇంటిలోకి రావద్దు’ అంటూ బోర్డులు పెట్టుకుని అజ్ఞాత జీవితం గడపవలసిన స్థితికి మనిషిని కరోనా దిగజార్చింది.


ప్రస్తుతం కరోనా కు మందు కాని వ్యాక్సీన్ లేకపోవడంతో ఎవరికివారు భౌతిక దూరం పాటించడమే ఒక పరిష్కారం అంటూ అంతా అంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులలో విశాఖపట్టణంకు చెందిన ప్రముఖ డాక్టర్ పద్మశ్రీ అవార్డ్ గ్రహీత కూటికుప్పల సూర్యారావు చెపుతున్న ‘గొడుగు థియరీ’ పై ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం కూడ ఆసక్తి కనపరిచింది అంటూ ఇప్పుడు మీడియాలో వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం చాలామంది ప్రతిరోజు రైతు బజార్లకు అదేవిధంగా చిన్నచిన్న దైనందిన అవసరాల నిమిత్తం రోడ్డు పైకి రావడం తప్పనిసరి అవుతున్న పరిస్థితులలో రైతు బజారు లాంటి ప్రదేశాలలో ఒకేసారి జనం విపరీతంగా గుమిగూడటంతో భౌతిక దూరం పాటించడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితులకు పరిష్కారంగా సూర్యారావుకు వచ్చిన మెరుపు లాంటి ఆలోచన ఈ గొడుగు థియరీ.


సాధారణంగా ప్రతి సామాన్య వ్యక్తి ఇంటిలో ఉండే గొడుగు నాలుగు మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. ప్రస్తుతం వేసవి మండిపోతోంది కాబట్టి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి గొడుగు వేసుకుని బయటకు వస్తే నాలుగు మీటర్ల వైశాల్యంలో ఉండే గొడుగు ప్రతివ్యక్తి చేతిలో ఉండటంతో ఎవరికీ వారికి తెలియకుండానే వారిమధ్య భౌతిక దూరం ఏర్పడుతుందని అదేవిధంగా ఒకవ్యక్తి తమ్ము తుంపరల నుండి కాని దగ్గు నుండి కాని వచ్చే ఇన్ఫెక్షన్ పక్కనున్న వ్యక్తికి అంటకుండా అతడి చేతిలో ఉన్న గొడుగు కవచంలా పని చేస్తుందని డాక్టర్ సూర్యారావు చేసిన ప్రతిపాదన ప్రధానమంత్రి కార్యాలయం చాల లోతుగా విశ్లేషిస్తున్నట్లు ఒక ప్రముఖ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇలా నోటికి మాస్క్ తల పై గొడుగుతో ఒక మనిషి బయటకు వస్తే ఇక కరోనా రక్కసి ఎవర్నీ ఏమి చేయలేదు అన్న ధైర్యం కలుగుతుంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: