గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వం దొంగలెక్కలు చెబుతోందంటూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. సీఎం జగన్ ముందుచూపు వల్లే రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. 
 
చంద్రబాబుకు కరోనా కేసుల విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ కు వచ్చి చెక్ చేసుకోవచ్చని చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుంటుంటే... లోకేష్ సైకిలింగ్ చేసుకుంటున్నాడని విమర్శలు చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయకపోయినా ఆశా వర్కర్లకు జీతాలు పెంచకపోయినా ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉండేదని ప్రశ్నించారు. 
 
చంద్రబాబు తిన్నది అరగక తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యాఖ్యలపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా చంద్రబాబు, టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందంటూ ఆరోపణలు చేయడంతో రోజా స్పందించారు. మరోవైపు ఏపీలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 
 
రాష్ట్రంలో నిన్న సాయంత్రం వరకు 603 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 42 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 16 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 545 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కర్నూలులో 132 కేసులు నమోదు కాగా వీరిలో ముగ్గురు మృతి చెందారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలు ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: