అవును మరీ అలుపూ సొలుపూ లేకుండా ఇంతకాలం పరుగులు తీశాయి. ఎక్కడ పడితే అక్కడకు ఎగిరాయి. హద్దు పద్దూ లేకుండా సరిహద్దులను చెరిపేశాయి. మొత్తానికి మొత్తం చుట్టేసి వచ్చేశాయి.

 

అటువంటి విమానాలకు ఇపుడు రెక్కలు తెగిపోయాయి. గత నెల 22న జనతా కర్ఫ్యూ అన్న తరువాత నుంచి విమానాలు ఎగరడం మరచిపోయాయి. ఇప్పటికి నెల రోజులు కావస్తోంది. కానీ చడీ చప్పుడు లేకుండా ఎక్కడ ఉన్నవి అక్కడే ఉండిపోయాయి. 

 

మే 3 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది. ఆ తరువాత కూడా విమానాలు ఎగరవని కేంద్ర మంత్రి మండలి తాజాగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. విమానాలు కనుక ఎగిరితే కరోనా వ్యాప్తిని తట్టుకోవడం కష్టమని అంటోంది.

 

దానికి తోడు సామాజిక దూరం పాటించడం అసలు కుదిరే పని కాదని కూడా అభిప్రాయపడుతోంది. ఈ నేపధ్యంలో విమానాలు, రైళ్ళను ఇప్పట్లో తిప్పరాదని కఠినమైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది.కొత్తగా రిజర్వేషన్లకు అనుమతించరాదని కూడా స్పష్టమైన ఆదేసాలను జారీ చేసింది.

 

రైళ్లు నడవకపోతే ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాల్సివస్తుంది. దాని వల్ల దూర ప్రాంతాల వారు వచ్చేందుకు ఆటంకం ఏర్పడుతుంది. నిజంగా ఇది ఇబ్బందే. అంటే లాక్ డౌన్ పేరిట నలభై రోజులు గడచినా కూడా ఈ ప్రధాన రవాణా సేవలు జనాలకు అందుబాటులోకి రావు అంటున్నారు

 

 

దేశంలో ఒక్కసారిగా పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసుల కారణంగానే ఈ రకమైన నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని అంటున్నారు. మొత్తానికి రెక్కలు తెగిన పక్షుల్లా విమానాలు, రైళ్ళూ అలా  మిగిలిపోతున్నాయి. ఇది ఎన్నడూ చూడని వ్యవహారమే మరి.

 

నీలాకాశంలో మళ్ళీ వాటిని చూడాలంటే మాత్రం మరి కొన్నాళ్ళూ అలా కళ్ళు కాయలు కాయాల్సిందేనట. కరోనా జీరో లెవెల్లోకి వచ్చేంత వరకూ కూడా  విమానాలకు రెక్కలు తగిలించరని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: