లాక్‌ డౌన్‌.. కరోనా బారి నుంచి మనల్ని కాపాడుకోవడం కోసం కేంద్రప్రభుత్వం గతి లేక విధించిన ఆంక్ష.. ఇల్లు దాటితే కరోనా కాటేస్తోంది. ఇదీ ప్రధాని మోడీ హెచ్చరిక. అయితే ఇలాంటి హెచ్చరిక ఈ కలి కాలంలోనే కాదు. ఆనాటి మహా భారతంలోనూ ఉందట. విచిత్రంగా ఉన్నా ఆసక్తికరంగా ఉంది కదా. ఆ కథేంటో చూద్దాం.

 

 

మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు కురుక్షేత్రాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తున్నారట. ఆ సమయంలో మైదానాన్ని చదువు చేసే సమయంలో ఒక పెద్ద ఏనుగు ఓ చెట్టును కూల్చేసింది. ఆ చెట్టు తొర్రలో ఓ పిచ్చుక ఉండేది. దానికి నాలుగు పిల్లలు. అన్నీ కిందపడ్డాయి. అప్పుడు ఆ పిట్ట కృష్ణా.. ఏమిటిదంతా దేవా..? అడిగిందట. అప్పుడు కృష్ణుడు.. తప్పదమ్మా అంతా విధి రాత. నువ్వూ, నేను నిమిత్తమాత్రులమే కదా.. అన్నాడట. అప్పుడా పిట్ట.. నా పిల్లల్ని కాపాడాల్సింది నువ్వే, నీమీదే భారం వేస్తున్నా అని మొరపెట్టుకుందట. అప్పుడు కృష్ణుడు ఆ పిచ్చుకతో నీకూ, నీ పిల్లలకు మూడు వారాలకు సరిపడా తిండిని ఎలాగోలా తెచ్చి పెట్టుకో అన్నాడట.

 

 

రెండు రోజులు గడిచాయి. యుద్ధం కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అప్పుడు కృష్ణుడు ఒకసారి నీ ధనుస్సు ఇవ్వు బావా అనడిగాడు అర్జునుడిని.. అర్జునుడిచ్చిన గాండీవాన్ని చేతుల్లోకి తీసుకుని, ఓ బాణాన్ని ఎక్కుబెట్టి, ఘీంకరిస్తున్న ఓ ఏనుగుకు గురిపెట్టి వదిలాడు. బాణం నుగు మెడలో కట్టి ఉన్న పెద్ద గంటను తాకింది. ఆ గంటకు ఉన్న తాడు తెగి, గంట కింద పడిపోయింది.

 

 

ఆ గంట సరిగ్గా పిచ్చుక, తన పిల్లలు .. అవి తెచ్చుకున్న ఆహారంపై కవచంగా పడిందట. ఆ తర్వాత 18 రోజులపాటు భయంకరంగా యుద్ధం జరిగినా.. ఆ పిచ్చుక, పిల్లలు మాత్రం క్షేమంగా ఉన్నాయట. యుద్ధం ముగిశాక శ్రీకృష్ణుడు వెళ్లి ఆ గంట పైకి లేపితే.. ఆ నాలుగు పిచ్చుకలు హాయిగా గాల్లోకి ఎగిరాయట. అంటే యుద్ధం సమయంలో ఆ పిచ్చుకలు ఇప్పుడు మనం లాక్‌డౌన్‌ కాలంలో ఉన్నట్టు ఆ గంట కిందే ఉండి ప్రాణాలు దక్కించుకున్నాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: