చంద్రబాబు జాతీయ స్థాయిలో  మనకున్న సీనియర్ మోస్ట్ తెలుగు  లీడర్. ఆయన తెలివి తేటలు అమోఘం. చురుకుదనం. సమయస్పూర్తి, రాజకీయంగా ఎత్తులు వేయడంలో నైపుణ్యం అన్నీ కలసి ఆయన్ని చాణక్యుడుగా చేశాయి.

 

చంద్రబాబు వయసు ఈ రోజుతో 70 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఆయన 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో పుట్టారు. ఆయన సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకున్నారు. ఆయన చిన్నతనంలో తల్లి అమ్మణ‌మ్మకు వంట పనిలో, ఇతర పనుల్లో సాయం చేసేవారు. 

అప్పట్లో ఆయన చూపు ఎపుడూ ఆకాశం మీదనే ఉండేది. చెట్టు నీడన చదువుకున్నా తాను శిఖరాలు అధిరోహించాలనుకునేవారు. అయితే చంద్రబాబుకు ఉన్న తెలివి తేటల వల్ల చిత్తూరు జిల్లాలోని శ్రీ వెంకటేశ్వరా యూనివర్శిటీలో సీటు సంపాదించి ఎమ్మే  ఎకనామిక్స్ చేశారు.

 

ఆయన యూనివర్శిటీలో  ఉన్నపుడే రాజకీయంగా చురుకుగా ఉండేవారు. విద్యార్ధి ఎన్నికల్లో ఆయన తాను పాల్గొని తన వారిని గెలిపించుకుని విజేతగా నిలిచారు. ఇక ఇందిరా కాంగ్రెస్ గా జాతీయ కాంగ్రెస్ చీలినపుడు 1978లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో బాబుకు చంద్రగిరి నుంచి పోటీ చేసే అరుదైన  అవకాశం లభించింది.

 

ఆయన మంచి మెజారిటీతో గెలిచి 28 ఏళ్ళకే ఎమ్మెల్యే అయిపోయారు. ఆ తరువాత వరసగా అంజయ్య, భవనం వెంకటరాం మంత్రి వర్గాల్లో మంత్రి పదవులు చేపట్టారు. ఆయన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండగానే నాడు తెలుగులో అగ్ర నటుడిగా ఉన్న ఎన్టీయార్ తో పరిచయం కావడం, ఆయన మూడవ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకోవడం జరిగాయి.

 

ఇక తెలుగుదేశానికి ఎదురు నిలిచి  చంద్రగిరిలో 1983లో పోటీ చేసినప్పటికీ బాబు మామ ఎన్టీయార్ ప్రభంజనంలో  ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీలో చేరి ఆగస్ట్ సంక్షోభంలో అన్న గారిని మళ్ళీ గద్దె మీద కూర్చోబెట్టేందుకు పన్నిన వ్యూహాలు విజయవంతం అయ్యాయి.

 

ఇక 1995లో అన్న గారిని వెన్నుపోటు పొడిచి గద్దె దించారన్న మచ్చ బాబుకు లేకపోతే మాత్రం ఆయన అచ్చమైన చంద్రుడుగానే ఉండేవాడని అంతా అంటారు. నిజానికి బాబు ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడే. అలాగే టీడీపీని పెంచి పోషించారు. ఇన్ని చేసిన  బాబు అన్న గారికి అసలైన  వారసుడు అయ్యేవారే. అయితే అన్న నందమూరిని ఒప్పించి టీడీపీ భావి నాయకుడు అయినట్లైతే బాబుకు ఇపుడున్న పరాభవాలు అవమానాలు లేకపోయి ఉండేవన్న భావన అందరిలోనూ ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: