లాక్ డౌన్ నిబంధ‌న‌లు రాష్ట్రంలోని ప్ర‌జ‌లంతా ప‌ద్ద‌తిగా ఫాలో అవుతున్నార‌ని, హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ కూడా ఇందులో ఉంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ వెసులుబాటు స‌మ‌యం విష‌యంలో కొంద‌రు ఎంఐఎం ఎమ్మెల్యేలు సైతం ప‌లు అభ్యంత‌రాలు త‌న దృష్టికి తెచ్చార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, పాతబస్తీలో లాక్‌డౌన్‌ నిబంధనలు పట్టించుకోవడం లేదని... ప్రభుత్వం, అధికారులు హెచ్చరిస్తున్నా.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా.. యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారని మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

 


చార్మినార్‌ జోన్‌ పరిధిలో 127 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో, చార్మినార్‌, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్‌, మలక్‌పేట్‌, చాంద్రాయణగుట్ట పరిధిలో జీహెచ్‌ఎంసీ అధికారులు  సుమారు 35 కంటైన్‌మెంట్‌ జోన్లను గుర్తించారు. నియంత్రిత ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధించారు.  కానీ కొందరు ఆకతాయిలతో శ్రమ వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినా.. పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో నిబంధనలకు నీళ్లొదులుతున్నారని ప‌లువురు వివిధ మీడియా సంస్థ‌ల‌తో వ్య‌క్తం చేస్తున్నారు. 

 

కాగా, ఈ ఉల్లంఘ‌నుల‌పై పోలీస్‌లు సీరియ‌స్‌గా దృష్టిసారించారు. కొందరు చిన్న చిన్న కారణాలతో ద్విచక్ర వాహనాలపై బయటకు వస్తున్న నేప‌థ్యంలో  వారి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 3 వేలకు పైగా వాహనాలను సీజ్‌   చేశామని పోలీసులు తెలిపారు.  వాహనం మూడు కిలోమీటర్లకంటే అధిక దూరం వెళ్తినట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు.  అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

 


కాగా, పాతబస్తీ ఆల్‌ ముస్తాఫానగర్‌లో కంటైన్‌మెంట్‌ ఏరియాలో శనివారం మధ్యాహ్నం నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ పర్యటించారు. ఈ బస్తీకి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ రాగా.. ఆమెను వైద్యశాలకు తరలించి.. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. ఈ సందర్భంగా సీపీ ఆ బస్తీలో పర్యటించి మాట్లాడుతూ.. క్వారంటైన్‌లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులతో పాటు  ఇతర  ఏ అవసరాలు ఉన్నా జీహెచ్‌ఎంసీ అధికారులు లేదా ఇతర అధికారులు వారికి అందేలా చూస్తున్నారన్నారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: