తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. జిల్లాలో నిన్న మరో కేసు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 34కు చేరింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు చనిపోగా ముగ్గురు కరోనా నుంచి కోలుకుని ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో 29 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గద్వాలలో శుక్రవారం 2 కొత్త కేసులు నమోదు కాగా శనివారం 8 కేసులు, ఆదివారం ఒక కేసు నమోదయ్యాయి. 
 
 
మరోవైపు రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో రెండు రోజుల క్రితం రెండు నెలల శిశువుకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. బాలుడు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తిలో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో కరోనా కేసులు నమోదైనా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో ఈ రెండు జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 
 
గద్వాల జిల్లా అధికార యంత్రాంగం కరోనాను కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లాలో పేదల వైద్యునిగా పేరు గాంచిన ఇస్మాయిల్ అనే డాక్టర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈయనతో వైద్యం చేయించుకున్న గద్వాల్ జిల్లా వాసికి కరోనా సోకింది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు. 
 
అధికారులు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచనలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలోకి కొత్త వారిని అనుమతించడం లేదు. కర్నూలు జిల్లాలో 158 కరోనా కేసులు నమోదు కావడంతో గద్వాల, వనపర్తి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.  అధికారుల అప్రమత్తత వల్లే వనపర్తిలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: