ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో నిన్నటివరకు 647 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 158 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. 
 
తాజాగా గుంటూరులో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం జిల్లాలో కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. వచ్చే నెల 3వ తేదీ వరకు జిల్లాలో ఈ నిబంధనలు అమలులో ఉండనున్నాయి. ప్రజలు లాక్ డౌన్ ముగిసే వరకు ఈ నిబంధనలను పాటిస్తే కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువ అని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ప్రజలు రోడ్లపైకి రావాలంటే కేవలం మూడు గంటలు మాత్రమే అనుమతి ఉంటుంది. 
 
అధికారులు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు రైతు బజార్లు, కిరాణా షాపులు, జనరల్ మార్కెట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. టేక్ అవే హోటల్స్ కు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అనుమతి ఉంటుంది. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సూచించారు. 
 
కలెక్టర్ ఒకే చోట ఎక్కువమంది గుమికూడరాదని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సర్వీసులకు సంబంధించిన వాహనాలు యథావిధిగా తిరగవచ్చని చెప్పారు. ప్రత్యేక అనుమతులు తీసుకుని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాహనాలు, ఆయిల్ అండ్ గ్యాస్ ఫిల్లింగ్ వాహనాలు, మొబైల్ కమ్యూనికేషన్ వాహనాలు తిరగవచ్చని తెలిపారు. రాష్ట్రంలో నిన్నటివరకు 65 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 17 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: