కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న అమెరికాలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చేయడానికి పనిలేక.. తినడానికి తిండి లేక జనం అల్లాడిపోతున్నారు. దీంతో ఫుడ్‌ బ్యాంకుల ముందు జనం బారులు తీరుతున్న దృశ్యాలు అమెరికా అంతటా కనిపిస్తున్నాయి. కార్లలో వస్తున్నవారు గంటల తరబడి క్యూలో ఉండి మరీ.. ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నారు. అగ్రరాజ్యంపై కోవిడ్‌19 ఎఫెక్ట్‌ ఏ స్థాయిలో ఉందో తాజా పరిణామాలే అద్దంపడుతున్నాయి.

 

అమెరికాలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తిండి కోసం జనం పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. ఫుడ్‌బ్యాంకుల ముందు బారులు తీరి కనిపిస్తున్నారు. కాస్త కడుపు నిండితే చాలు.. ప్రాణాలు నిలబెట్టుకోవచ్చన్న ఆవేదన అక్కడి జనాల్లో ఉంది. 

 

కరోనా విసిరిన పంజాకు అమెరికా గ్రహస్థితి మారిపోయింది. అమెరికన్ల జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అమెరికాలో కరోనా పాజటివ్‌ కేసులు ఏడున్నర లక్షలు దాటిపోయాయి. మరణాలు 40వేల పైనే!. లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల ఉద్యోగాలు పోయాయి. సంపాదన లేదు. చేతిలో డబ్బు లేదు. తినడానికి తిండి లేదు. ఒకవేళ చేతిలో డబ్బులు ఉన్నా.. ఏదైనా కొనుక్కుని తిందామని స్టోర్స్‌కు వెళ్లితే.. అక్కడి ర్యాక్స్‌ వెక్కిరిస్తున్నాయి.

 

కరోనా కట్టడికి ఆంక్షలు విధిస్తున్న సమయంలోనే చాలా మంది ముందుజాగ్రత్తగా నిత్యావసరాలు కొనేసి స్టాక్‌ పెట్టుకున్నారు. ఎవరిస్థాయిలో వారు కొనుగోలు చేసి సేఫ్‌గా ఉన్నామని భావించారు. కానీ.. కరోనా ఇన్ని రోజులు  వేధిస్తుందని.. ఒక పట్టాన వైరస్‌ లొంగబోదని వారు ఊహించలేదు. దీంతో దాచుకున్న డబ్బులు, కొనుగోలు చేసిన ఆహార పదార్థాలు అయిపోయాయి. అర్థాకలితో అలమటిస్తున్నారు ప్రజలు. రేపటి సంగతి దేవుడెరుగు.. ఈ రోజు గడిచేదెలా? ఇవాళ ఆకలి బాధ తీరేదెలా? ఈ మనోవ్యధే వారికి నిద్రను దూరం చేస్తోంది. 
నిత్యావసరాలు, ఆహార పదార్థాల కోసం కుటుంబాలతో సహా ఫుడ్‌బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు అమెరికన్లు. ఇలాంటి ఫుడ్‌బ్యాంకుల ముందు కనుచూపు మేరలో కార్లు బార్లు తీరి కనిపిస్తున్నాయి. వాస్తవానికి కరోనా లాక్‌డౌన్‌ దెబ్బకు వ్యాపార కార్యకలాపాలు మూతపడటంతో ఒక్క అమెరికాలోనే 2 కోట్ల మందికిపైగా రాత్రికి రాత్రికి రోడ్డున పడ్డారు. గతంలో మానవతా ధృక్పథంతో ఎంతో కొంత ఫుడ్‌ బ్యాంకులకు సాయం చేసిన వారే.. ఇప్పుడు వాటి ముందు ఆకలి కేకలతో క్యూ కడుతున్నారు. వీరే కాదు.. ఇంతకుముందెన్నడూ ఫుడ్‌బ్యాంకులవైపు తలతిప్పి చూడని వారు సైతం ఆహారం కోసం బారులుతీరుతున్నారు. తమ వంతు వచ్చే వరకూ ఓపికగా  ఎదురు చూస్తున్నారు. 

 

అమెరికాలో నెలకొన్న తాజా పరిస్థితుల వల్ల ఫుడ్‌బ్యాంకుల్లోని ఆహార పదార్థాలకు 40శాతానికిపైగా డిమాండ్‌ పెరిగిందంటే ఆకలి బాధలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పెన్సిల్వేనియాలోని గ్రేటర్‌ పిట్స్‌బర్గ్‌ కమ్యూనిటీ ఫుడ్‌ బ్యాంక్‌, టెక్సాస్‌, కాలిఫోర్నియా ఇలా  ఏ ప్రాంతంలోని ఫుడ్‌బ్యాంక్‌లను చూసినా కిలోమీటర్ల కొద్దీ  క్యూలు కనిపిస్తున్నాయి.  లైన్‌లో ఉన్నవారి ముఖాల్లో ఏదో తెలియని వ్యథ కనిపిస్తోంది. ఎవరిని పలకరించినా ఉబికి వచ్చే కన్నీళ్లను బలవంతంగా ఆపుకొంటున్నారు. వారి మాటలు, చూపులను పరిశీలిస్తే ఎవరైనా ఆదుకుంటే బాగుండు.. అనేలా ఉంటున్నాయి.  గంటల కొద్దీ ఎదురు చూపుల తర్వాత ఆహార పదార్థాల కవర్‌ చేతికి అందినవారి ముఖంలో ఎక్కడలేని సంతోషం కనిపిస్తోంది. అప్పటి వరకూ వారిలో కనిపించిన ఆవేదన మయమవుతోంది. ఎదో గొప్ప విజయం సాధించినట్లు ఫీలయ్యేవారు కొందరైతే.. ఇవాళ్టికి ప్రాణాలు నిలిచాయని భావించేవారు మరికొందరు. 

 

అమెరికా అంతటా ఇలాగే ఉంది. గత వారం పదిరోజులుగా ఏ ప్రధాన నగరం చూసినా ఇలాంటి హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. కాకపోతే.. రెండు మూడు రోజులుగా మరీ ఎక్కువైంది. జనం అదే పనిగా ఫుడ్‌ బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. అమెరికాలో కరోనా ఏ స్థాయిలో బుసలు కొడుతుందో చెప్పడానికి ఈ సంఘటనలు అద్దం పడతాయి. శాన్‌ ఆంటోనియోలోని ఫుడ్‌బ్యాంక్‌  రోజూ 6.6 మిలియన్‌ పౌండ్ల ఆహారాన్ని వితరణ చేస్తుంది. ఇక్కడ అందించే నిత్యావసరాలతో ఒక కుటుంబం నెలరోజులపాటు ఎలాంటి చీకుచింత లేకుండా గడిపే వీలుంది. 

 

ఈ ఇబ్బందులు, కష్టాలు కొద్దికాలమంటే ఓర్చుకుంటాం. దీర్ఘకాలం తమ వల్ల కాదని.. ఇల్లు గడిచేది  ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆంక్షలు ఎత్తేయాలని అమెరికాలో చాలాచోట్ల జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. కరోనా మహమ్మారి భయపెడుతున్నా.. ఆకలి బాధ భరించలేక లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఉపాధి కోల్పోయిన వారిని, నిరుద్యోగులను ఆదుకోవడానికి ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల ముందు అవేమీ సత్ఫలితాలను ఇవ్వడం లేదు. పైగా దేశ ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అధ్యక్షుడు ట్రంప్‌ సైతం ఆంక్షలపట్ల సానుకూలంగా లేరు. ఎప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తేద్దామా అని ఆయన ఎదురు చూస్తున్నారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారికి మద్దతు ప్రకటిస్తున్నారు. 

 

లాక్‌డౌన్‌ ఎత్తేస్తే కరోనా వ్యాప్తి మరింతగా ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి సూచనల మేరకు లాక్‌డౌన్‌ ఎత్తేయడానికి రాష్ట్రాల గవర్నర్లు సుముఖంగా లేరు. ఇండియానాలో మే ఒకటి వరకూ ఆంక్షలు ఉంటాయని అక్కడి గవర్నర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఇప్పట్లో పరిస్థితులు కుదుటపడబోవని ఆందోళన చెందుతున్న జనం.. ఫుడ్‌బ్యాంకులే తమ ప్రాణాలను నిలబెడతాయని ఆశిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో రెండు ప్రాంతాలే కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఒకటి కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు రద్దీగా ఉంటే.. రెండోది ఫుడ్‌బ్యాంకులు. కుటుంబాలతో సహా ఫుడ్‌బ్యాంకుల దగ్గరకు వస్తున్నారంటే..  భవిష్యత్‌పై వారికెంత భయం నెలకొందో అర్ధం చేసుకోవచ్చు. ఆంక్షలు మరికొంత కాలం కొనసాగే సూచనలు కనిపిస్తుండటంతో.. ప్రస్తుతం ఇవే అక్కడి ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: