ఏపీలోని కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జిల్లాలో ఈరోజు 16 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 174కు చేరింది. వీరిలో ఐదుగురు మృతి చెందగా ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలోని 17 ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రకటించింది. 
 
ప్రభుత్వం హాట్ స్పాట్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. అయితే తాజాగా కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో కోతులు మరణించడం సంచలనం రేపింది. పెద్ద సంఖ్యలో కోతులు మరణిస్తూ ఉండటంతో ప్రజలు భయపడుతున్నారు. మరికొన్ని కోతులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండటంతో కరోనా వల్లే కోతులు మరణించి ఉండవచ్చని జిల్లాలో ప్రచారం జరిగింది. 
 
జిల్లాలోని గడివేములు చుట్టుపక్కల ప్రాంతాలలో కోతులు మరణించడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కోతుల మృతదేహానికి పోస్టుమార్టం చేసి అసలు కారణం తేల్చారు. జిల్లాలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతూ ఉండటంతో కోతులకు ఆహారం దొరకట్లేదని... ఆకలికి తట్టుకోలేక కోతులు మరణించాయని చెబుతున్నారు. ఆకలి బాధ వల్ల కోతులు మరణించాయని తెలిసి కొందరు మిగిలిన కోతులకు ఆహారం అందించారు. 
 
అధికారులు జంతువులు మృతి చెందకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాలో నమోదైన కేసుల్లో ఎక్కువమంది మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులే అని సమాచారం. జిల్లాలో కాంటాక్ట్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అధికారులు కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. జగన్ సర్కార్ రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తెప్పించిన ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు పంపిణీ చేయడానికి సిద్ధమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: