కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేగుతోంది. ఇక్కడ ఇప్పటికే 174 కరోనా కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో విపత్కర పరిస్థితి ఏర్పడుతుందనే అంచనాలున్నాయి. వైరస్ నియంత్రణకు అధికారులు తీసుకుంటున్నారు.  

 

కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. మొదట్లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవతున్నా.. కర్నూలు మాత్రం అట్టడుగు స్థానంలో ఉండేది. అయితే సంజామల మండలం నొస్సంలో రాజస్థాన్ యువకునికి పాజిటివ్ వచ్చిందన్న వార్త వెలువడింది. ఒక్క కేసే కదా అనుకున్నారు. అయినా జిల్లా అంతా అప్రమత్తమైంది. మరో మూడు రోజులకు కర్నూలు, అవుకు, బనగానపల్లిలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఆ తరువాత ఒక్కసారిగా కరోనా బాంబు పేలింది. ఒకే రోజు 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఆ సంఖ్య 74కు చేరింది. ఇలా కరోనా పాపం పెరుగుతూ పోయింది. ఢిల్లీ మర్కజ్ పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి ఎంతమంది వెళ్లారో ఆరా తీస్తే సుమారు 400 మంది వెళ్లి వచ్చినట్టు తేలింది. వారందరినీ క్వారంటైన్ చేసి స్వాప్ పరీక్షలు చేస్తే అందులో 72 మందికి మర్కజ్ వెళ్లిన వారికి వచ్చినట్టు నిర్ధారణ అయింది.


 
కరోనా పాజిటివ్ కేసుల్లో కర్నూలు అగ్రస్థానంలో ఉంది. 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు. ఒక్క కర్నూలు నగరంలోనే 81 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇద్దరు వైద్యులకు కూడా కరోనా సోకింది. అందులో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యజమాని కరోనాకు బలయ్యారు. ఆ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందిన వారు, సిబ్బందిని కలసిన వారు, చికిత్స పొందిన వారిని కలసిన వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మృతి చెందిన డాక్టర్ కు సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్స్ లో 213 మందిని గుర్తించారు. వారిలో ఇప్పటికే 20 మంది వరకు పాజిటివ్ వచ్చింది. సెకండరీ కాంటాక్ట్స్ గా 950 మందిని గుర్తించారు. వారందరికీ పరీక్షలు చేయాల్సి ఉంది. 

 

పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. క్వారంటైన్ సెంటర్లలో ఒక్కొక్కరికి అటాచ్ డ్ బాత్ రూమ్ ఉన్న గదులు ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. సీనియర్ ఐఎఎస్ అధికారి అజయ్ జైన్ ను కరోనా ప్రత్యేక అధికారిగా నియమించింది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో చర్చించడం, క్వారంటైన్ సెంటర్లను పరిశీలిచండం, అక్కడ ఉన్న సదుపాయాలను మెరుగు పర్చడం వంటి చర్యలకు ఉపక్రమించారు కరోనా ప్రత్యేక అధికారి. 

 

కర్నూలులో ఇప్పటికే ట్రూనాట్ మెషిన్లు ఉన్నాయి. నంద్యాల, బనగానపల్లి, ఆదోని లో ట్రూనాట్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు సుమారు 300 పరీక్షలు చేసే అవకాశం కల్పించారు. కర్నూలులోనే పిసిఆర్ మిషన్ ఏర్పాటు చేసి స్వాబ్ పరీక్షకు ఏర్పాట్లు చేశారు. అర్బన్ ప్రాంతాల్లో 114 కరోనా పాజిటివ్ కేసులు, రూరల్ ప్రాంతాల్లో 42 పాజిటివ్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 21 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  రెడ్ జోన్ కాని ప్రాంతాల్లో మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ప్రజలను అనుమతించి రెడ్ జోన్లలో ప్రజలకు అవసరమైన వస్తువులను డోర్ డెలివరీ పద్ధతిని అమలు చేస్తున్నారు. అయితే సరుకుల డోర్ డెలివరీ పద్ధతిలో కొంత లోపాలు ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: