రాష్ట్రం కాని...రాష్ట్రం. భాష కూడా తెలియదు. ఇంటికి వచ్చే మార్గం అసలు కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ కోసం రోజులు తరబడి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నా...సొంతూళ్లకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. తమను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఆదుకోవాలని ఉత్తరాంధ్ర మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

 

లాక్‌డౌన్‌ కారణంగా మత్స్యకారుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకార్మికులు సొంత రాష్ట్రానికి తిరిగి రావటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీకి చెందిన మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయారు. సోమనాథ్‌ జిల్లా వేరావల్ గ్రామంలోని ఫిషింగ్ హార్బర్‌లో ఉత్తరాంధ్రకు చెందిన ఐదు వేల మంది మత్స్యకారులు ఉండిపోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవటంతో తమను ఏపీ ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.   

 

శ్రీకాకుళం...విజయనగరం...విశాఖకు చెందిన ఐదు వేల మంది మత్స్యకారులు ఆగస్టు నెలలో గుజరాత్‌కు వలస వెళ్లారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సముద్ర జలాల్లోనే వేట కొనసాగిస్తారు. 8 నెలల పాటు వీరి వేట కొనసాగుతుంది. చేపల వేటకు వెళ్లిన ప్రతీ సారి 25 రోజుల పాటు సముద్ర జలాల్లోనే ఉండిపోతారు. ఆ తర్వాతే ఒడ్డుకు వస్తారు. మళ్లీ మత్స్య సంపద కోసం సముద్రంలోకి వెళ్తుంటారు. ఐతే...గడిచిన 25 రోజుల నుంచి చేపల వేటకు వెళ్లలేదు. బోటు యజమానులు వీరికి జీతాలు చెల్లించలేదు. జెట్టీ లోపల మురికి కాలువలోనే ఉంటున్నారు. దోమలు కుడుతుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. 

 

ఇక...ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమను సొంతూళ్లకు చేర్చాలని కోరుతున్నారు మత్స్యకారులు. తాగటానికి కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నానం చేయటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో దుర్భర జీవితం గడుపుతున్నామంటున్నారు. మత్స్యకారులకు మౌలిక సౌకర్యాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉప్పు నీటిలోనే 24 గంటల పాటు ఉండే ఓ మత్స్యకారుడికి రోజు కూలీ కింద 3 వందల 33 రూపాయలు ఇస్తారు. చేపలు పట్టటం తప్ప వేరే పని తెలియని మత్స్యకారులు ఇప్పుడు గుజరాత్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 

ఇక...అక్కడే ఎవరైనా చనిపోతే ఇంటికి తీసుకొచ్చే అవకాశం కూడా లేదు. ఇటీవలే...శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నంకు చెందిన ఎన్నింటి జగన్నాథం అనే మత్స్యకారుడు జ్వరంతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండానే తోటి మత్స్యకారులే అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలను మొబైల్‌లో చిత్రీకరించి కుటుంబ సభ్యులకు పంపించారు. ఇక్కడ ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని షిప్పులోనైనా తమను విశాఖపట్నం తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. రోడ్డు...రైలు రవాణా వీలు కాకపోతే జల రవాణా ద్వారానైనా తమను సొంతూళ్లకు చేర్చాలని కోరుతున్నారు. 

 

మరోవైపు...తమను క్వారంటైన్‌లోనైనా ఉంచాలని కోరుతున్నా గుజరాత్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు ఉత్తరాంధ్ర మత్స్యకారులు. సత్వరమే ఏపీ సీఎం జగన్ స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: