కరోనా.. కరోనా.. కరోనా.. కొన్ని రోజులుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మహమ్మారి.. ఎక్కడో చైనా లో పుట్టి క్రమంగా ప్రపంచమంతా పాకి.. లక్షకుపైగా ప్రజలను ఇప్పటికే పొట్టన పెట్టుకున్న మహమ్మారి. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలే బెంబేలెత్తిపోతున్నాయి. అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటివి కూడా కుదేలవుతున్నాయి. ప్రతిరోజూ వేల సంఖ్యలో జనం చనిపోతున్నారు.

 

 

అయితే ఇప్పుడు ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే.. కరోనా మహమ్మారి జోరు తగ్గింది. నిన్న మొన్నటి వరకూ అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో రోజూ కనీసం 1400మంది వరకూ చనిపోయేవారు. అమెరికాలో ఒకే రోజు 2500 మందికి పైగా మరణించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా స్పీడు తగ్గింది. అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ ఈ దేశాలన్నింటిలోనూ కరోనా మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంటడం కాస్త ఊరట కలిగిస్తోంది.

 

 

తాజా లెక్కల ప్రకారం చూస్తే.. అమెరికాలో సోమవారం దాదాపు 800 మంది మాత్రమే చనిపోయారు. స్పెయిన్, ఇటలీ, బ్రిటన్‌లలో ఈ సంఖ్య 500 దాటక పోవడం కాస్త ఊరట నిస్తోంది. ఒక్క ఫ్రాన్స్ లోనే.. ఈ చావుల సంఖ్య 500 దాటింది. ఓవైపు కరోనా విజృంభిస్తుందని బాధ ఉన్నా.. చావుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఆయా దేశాలకే కాదు.. ప్రపంచానికే ఊరటనిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు.

 

 

ఇదే తరహా లెక్కలు ఇండియాలోనూ కనిపిస్తున్నాయి. ఇండియాలో కేసులు గతంలో ప్రతి మూడు రోజులకూ రెట్టింపవుతుండేవి.. కానీ ఇప్పుడు ఇలా రెట్టింపు కావడానికి ఏడు రోజులుపైగా సమయం పడుతోందట. అంటే ఆ మేరకు కరోనా వైరస్ జోరు కాస్త తగ్గినట్టేగా. అలాగని ప్రపంచం రిలాక్సవడానికి లేదు కానీ.. కొంతలో కొంత ఉపశమనంగా ఈ లెక్కలు కనిపిస్తున్నాయి. ఈలోగా వ్యాక్సీన్ కనిపెడితే.. ఈ చావులు కూడా తగ్గించే అవకాశం పుష్కలంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: