హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ బాయ్ కు కరోనా నిర్ధారణ కావడంతో సీఎం కేసీఆర్ మే నెల 7వ తేదీ వరకు తెలంగాణలో స్వీగ్గీ, జొమాటో సేవలకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో పండ్లు, కూరగాయల డోర్ డెలివరీ కోసం స్విగ్గీ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో స్విగ్గీ సేవలకు అనుమతిచ్చింది. నిన్న రాత్రి స్విగ్గీ సంస్థ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
స్విగ్గీ ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్, ఇతర ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పాస్ వ్యవస్థ ఎంతో యూజర్ ఫ్రెండ్లీగా ఉందని స్విగ్గీ ప్రశంసించింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని... జాగ్రత్తగా ఉండాలని కోరింది. ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో స్విగ్గీ సేవలను వినియోగించుకుని పండ్లు,కూరగాయలు డోర్ డెలివరీ చేయనుంది. 
 
ఏపీ మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో స్విగ్గీ పండ్లు, కూరగాయలు డోర్ డెలివరీ చేయనుంది. రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరగడం, ప్రజలు నిత్యావసర వస్తువులు , పండ్లు కొనుగోలు చేసేందుకు బారులు తీరుతూ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ డెలివరీ బాయ్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని... చాలా సురక్షిత మార్గంలో వస్తువులను డోర్ డెలివరీ చేయనున్నామని పేర్కొంది. 
 
డెలివరీ బాయ్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటిస్తున్నారని... ఫుడ్, ఇతర వస్తువుల పికప్ కు ముందు హ్యాండ్ శానిటైజర్ ను వినియోగిస్తారని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రత్యేక టెక్నాలజీ సహాయంతో డెలివరీ బాయ్ మాస్క్ ను వినియోగిస్తున్నాడో లేదో తెలుసుకుంటున్నామని అన్నారు. కష్ట సమయంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని స్విగ్గీ చెబుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: