దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కరోనాకు మందు కనిపెట్టే దిశగా ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ ను నివారించడంతో ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలను ఇస్తోందని వైద్యులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వెంటిలేటర్ పై ఉన్న వ్యక్తికి వైద్యులు ప్లాస్మా థెరపీ ద్వారా కరోనాను నయం చేశారు. 
 
వారం రోజుల క్రితం దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఈ థెరపీ ద్వారా ఒక కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు. ఢిల్లీలో కరోనా సోకిన వ్యక్తి గత కొన్నిరోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆ వ్యక్తికి ప్లాస్మా థెరపీతో చికిత్స చేశారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మా సేకరించి అతడికి చికిత్స చేశారు. 
 
ప్లాస్మా థెరపీ అనంతరం కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు. డాక్టర్లు ప్రస్తుతం ఆ వ్యక్తికి వెంటిలేటర్ ను తొలగించారు. ప్లాస్మా థెరపీ కరోనాను నివారించడంలో సమర్థవంతంగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.  పలు దేశాల్లో ఇప్పటికే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టారు. ఆ వ్యాక్సిన్ లపై ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ట్రయల్స్ సక్సెస్ అయితే అనుమతుల అనంతరం వ్యాక్సిన్ మార్కెట్ లో విడుదలవుతుంది. 
 
మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 18000కు చేరింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో నిన్న ఒక్కరోజే 75 కరోనా కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 722కు చేరింది. మరోవైపు తెలంగాణలో 14 కొత్త కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 872కు చేరింది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: