ఏం కరోనానో.. ఇదేం లాక్‌డౌనో గాని మందు బాబుల ప్రాణాలు మాత్రం ఆవిరైపోతున్నాయి.. ఇంత కాలం ఆ ఘాటు మందు తాగి తాగి అలవాటుపడిన నాలుకకు గత కొన్ని రోజుల నుండి మందు దొరక్కపోయే సరికి ఒడ్డుమీద పడ్డ చేపలా గిల గిల లాడిపోతుంది.. కరోనా రోగులకంటే.. డ్రింక్ మాస్టర్ల బాధనే ఎక్కువగా కనిపిస్తుంది.. అసలే ఎండకాలం. చల్లని బీరు తాగి ఎన్ని రోజులైందో.. ఒక క్వాటర్ సీసా గొంతులోకి దిగక ప్రాణం విలవిలలాడిపోతుంది.. అందుకో కొందరు అడ్డదార్లు వెతుక్కుంటున్నారు మందుకోసం.. మరికొందరైతే దొంగతనాలు చేస్తుండగా.. ఇంకొందరు ఏదిపడితే అది తాగి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు..

 

 

ఇకపోతే కల్తీ మద్యం తయారు చేసే కేటుగాళ్లకు మాత్రం ఇది లాభసాటిగా మారింది.. ఒకవేళ చట్టానికి దొరకలేదనుకో.. ఈ దొంగ వ్యాపారం బాగానే గిట్టుబాటు అవుతుంది.. దొరికితే మాత్రం దేత్తడే.. ఇక ఈ కరోనా సమయంలో కొందరు కల్తీగాళ్లూ.. ప్రజల ప్రాణాలు ఏమైతే మాకేంటి అని భావించి కల్తీ కల్లు తయారు చేసి మందుబాబుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.. ఇలాంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా భయంకరమైన నిజం భయటకు వచ్చింది.. అదేమంటే వీరు తయారు చేసే కల్తీ కల్లులో  నిద్ర మాత్రలు కలుపుతున్నారట.. ఇక మదురైలో జరిగిన ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే..

 

 

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సారా, కల్లు విక్రయాలు జోరందుకున్న నేపధ్యంలో మదురై, కరుప్పాయి, ఊరని, వీరవంజన్‌, ఓడైపట్టి ప్రాంతంలో కల్లు విక్రయిస్తున్నట్టు కరుక్కూరని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఇన్‌ స్పెక్టర్‌ మాడస్వామి బృందం గోమతిపురంలో రామ్‌కుమార్, శేఖర్, మణికంఠన్, ఈశ్వరన్‌ను అనే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఆ విచారణలో పులిసిపోయిన గంజి నీళ్లలో నిద్ర మాత్రలు కలిపి కల్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది.. దీంతో పోలీసులు నిద్ర మాత్రలు కలిపిన 130 లీటర్ల నకిలీ కల్లును స్వాధీనం చేసుకోవడమే కాకుండా, ఇలాంటి మరో ముఠాను కూడా అదుపులోకి తీసుకున్నారు.. దీంతో పోలీసులు వారు ముగ్గురిని కూడా అరెస్టు చేశారు. చూసారుగా ఏదో ఒకటి తాగాలని భావించి గొంతులోకి దించుకుంటే పాడె ఎక్కవలసి వస్తుంది.. అందుకే మద్యం ప్రియులు కాస్త ఆగండి.. ఆలోచించండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: