ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం పలు దేశాలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. మన దేశంలో ఆరు కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు కృషి చేస్తుండగా వాటిలో మూడు కంపెనీలు హైదరాబాద్ కు చెందినవే కావడం గమనార్హం. నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ నిన్న ఈ విషయాలను వెల్లడించారు. 
 
భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలా, బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌, ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్‌, మిన్వాక్స్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు పోటీ పడుతున్నట్టు వెల్లడించారు. భారత్ కరోనా వ్యాక్సిన్ల తయారీకి కేంద్ర బిందువుగా ఉందని అమితాబ్ కాంత్ వెల్లడించారు. నీతిఅయోగ్ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఆరు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పోటీ పడుతుంటే వాటిలో మూడు కంపెనీలు హైదరాబాద్ కు చెందినవే కావడం గర్వకారణమని అన్నారు. 
 
ప్రపంచంలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్ లోనే తయారవుతున్నాయని మంత్రి తెలిపారు. మరోవైపు కరోనాను కొన్ని థెరపీలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన వైద్యులు వెంటిలేటర్ పై ఉన్న కరోనా బాధితుడిపై ప్లాస్మా థెరపీ ప్రయోగించి సక్సెస్ అయ్యారు. ప్లాస్మా థెరపీ కరోనాను ఎదుర్కోవడంలో సత్ఫలితాలను ఇస్తోందని వారు చెబుతున్నారు. 
 
ఇజ్రాయిల్ కు చెందిన వైద్యులు శాసవ్యవస్థలు దెబ్బతిని, పలు అవయవాలు పనిచేయకుండా ఉన్న ఏడుగురు రోగులపై పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారు. ఇజ్రాయిల్‌కు చెందిన ప్లూరిస్టెమ్ థెరపూటిక్స్ సంస్థ ఒక కొత్త థెరపీ ద్వారా ప్రయోగాలు చేసి సక్సెస్ అయింది. మరికొన్ని ట్రయల్స్ పూర్తయిన తరువాత అనుమతుల కోసం దరఖాస్తు చేస్తామని సంస్థ పేర్కొంది. 


 


 

మరింత సమాచారం తెలుసుకోండి: