కరోనా విలయంలో  మనం ఇప్పటి వరకు చూసింది కేవలం టీజర్ మాత్రమేనా? అసలు సినిమా ముందుందా..?  మహమ్మారి సృష్టించే విలయం ఇంకా ఉధృతంగా ఉండబోతుందా...? అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అన్నింటికీ సిద్ధపడి ఉండాలని హెచ్చరిస్తోంది. ప్రపంచ దేశాలు ఆంక్షలను క్రమంగా తొలగిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్ చేసిన ప్రకటన రానున్న ప్రమాదాన్ని సూచిస్తోంది.  

 

కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతోంది.  ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయి మహా మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి అన్ని దేశాలు. కరోనా రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును ఇప్పటికే ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. అయితే ఇంతకు మించిన ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా ఒక రూపాన్నే ఇప్పటి వరకు చూశామంటున్న డబ్ల్యూహెచ్ ఓ త్వరలోనే ఉగ్ర రూపాన్ని కూడా చూడాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తోంది.

 

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 25 లక్షలకు చేరువలో ఉన్నాయి. లక్షా 70 వేల మంది కరోనాకు బలైపోయారు. ఆధునిక మానవ సమాజం ఈ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఇటీవల కాలంలో అనుభవించలేదు. కోరలు చాస్తున్న కరోనాను చూసి ప్రపంచ మానవాళి వణికిపోతుంటే... ప్రమాద ఘంటికలు ఇంకా పొంచి ఉన్నాయని డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరిస్తోంది.

 

1918లో కోటి మందిని బలికొన్న స్పానిష్ ఫ్లూ ఎంత ప్రమాదకరమైనదో... కోవిడ్ 19 అంతకంటే ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. కరోనా తీవ్రతను ఇప్పటికీ చాలా మంది అర్ధం చేసుకోలేకపోతున్నారని చెబుతుంది. కరోనా మరణాలు 2 లక్షలకు చేరువవుతున్న సమయంలో  కరోనా సృష్టించే వినాశం ఇంకా రాలేదంటూ WHO చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది. WHO ప్రకటనలో తీవ్రతను గమనిస్తే... కరోనా వైరస్..మానవాళి మనుగడనే ప్రశ్నార్ధకంగా మారుస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు ఆంక్షలను పాక్షికంగా తొలగిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్ ఓ  చేసిన హెచ్చరిక డేంజర్ బెల్స్‌ను మోగిస్తుంది.

 

డబ్ల్యూహెచ్ ఓ అంచనాలే నిజమైతే... కరోనా మహమ్మారి ఇప్పటికిప్పుడు ప్రపంచాన్ని వదిలేలా కనిపించడం లేదు.  రానున్న కొన్ని నెలల పాటు కరోనా సృష్టించబోతున్న సునామీ ప్రపంచ దేశాలను మరింత సంక్షోభంలోకి నెట్టబోతోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: