ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు కర్నూలు జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదు కాగా గుంటూరులో 9 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, కడపలో 6, అనంతపురంలో 3, కృష్ణా జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 757కు చేరింది. 
 
రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతూ ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపడుతోంది. రెండు రోజుల క్రితం కడప, కర్నూలు జిల్లాలలో 100 రూపాయలకే 5 రకాల పండ్ల డోర్ డెలివరీ ప్రారంభించిన జగన్ సర్కార్ తాజాగా కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలలో పండ్ల డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రారంభించింది. త్వరలోనే పండ్ల డోర్ డెలివరీని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొంది. 
 
కష్టపడి పంటలు పండించిన రైతుల నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పండ్ల పంపిణీ ద్వారా ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ట్రంలో మామిడి పండ్ల సీజన్ మొదలైన నేపథ్యంలో మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. 
 
ఆయా జిల్లాల్లో పండ్ల లభ్యతను బట్టి ఐదు రకాల పండ్లను ప్రభుత్వం ప్రజలకు కేవలం 100 రూపాయలకే అందిస్తోంది. తక్కువ ధరకే పండ్లు లభిస్తూ ఉండటంతో ప్రజలు కూడా పండ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రైతుల నుంచి పండ్లను కొనుగోలు చేసి అటు రైతులకు, ఇటు ప్రజలకు ప్రయోజనం కలిగేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: