కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలోని పల్గర్ గ్రామంలో ఇద్దరు సాధువులను, అతడి డ్రైవర్ ను గ్రామస్థులు మూకుమ్మడి దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవరక ముందే గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గుజరాత్ లోని పంచమహల్స్ లో ఒక వాహనంలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులను దొంగలని భావించి గ్రామస్థులు దాడి చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. 
 
కొన్నిరోజుల నుంచి గుజరాత్ లోని గోద్రా ప్రాంతంలో దొంగలు ఉన్నారని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. దహోడ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వాహనంలో బయలుదేరగా గ్రామస్థులు వారిని దొంగలని భావించారు. గ్రామస్థులు వారిని ఆపి వివరాలు చెప్పాలని కోరగా ఆ ముగ్గురు వ్యక్తులు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో గ్రామస్థులు ఆ ముగ్గురు వ్యక్తులపై దాడికి దిగారు. 
 
అయితే కొంతమంది వ్యక్తులు గ్రామస్థులు ముగ్గురు వ్యక్తులను కొడుతున్నారని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులకు నచ్చజెప్పి వారిని కాపాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని... దీనికి సంబంధించిన విచారణను జరుపుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న విషయం తెలిసిందే. 
 
అయితే ఇదే సమయంలో కొన్ని వదంతులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఆ వదంతులను నమ్మి గ్రామాల్లోకి కొత్తవారు ఎవరైనా అడుగుపెడితే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు ఇలాంటి వదంతులను నమ్మవద్దని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా కొందరు మాత్రం వారిపై దాడులకు పాల్పడుతున్నారు. కేంద్రం ఇలాంటి దాడులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రజలకు వైరల్ అవుతున్న వదంతుల గురించి అవగాహన కల్పించాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: