తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎంతో కష్టపడి పండించిన పంట వర్షానికి తడిచిపోవడంతో గుండెపోటుతో రైతు మృతి చెందాడు. లింగంపేటకు చెందిన రైతు భూమయ్య రెండు రోజుల క్రితం ధాన్యం తీసుకుని పోల్కంపేట ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. కానీ ధాన్యం కొనుగోలు జరగలేదు. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. 
 
ఈరోజు ఉదయం ధాన్యాన్ని ఆరబోసిన రైతు ఆ తర్వత కొంతసేపటికే మృతి చెందాడు. రైతు మృతితో అతని కుటుంబ సభ్యుల్లో, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గత రెండురోజులనుంచి కామారెడ్డిలో, చుట్టుపక్కల గ్రామాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సురేంద్ర ఘటనా స్థలాన్ని సందర్శించి అధికారుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. మరికొందరు రైతులు అకాల వర్షాల వల్ల పంట తడిసిపోయిందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 
 
సొసైటీ నిర్వాహకులు ధాన్యం కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తులో ధాన్యం వస్తోందని... తడిచిన ధాన్యాన్ని తాము కొనుగోలు చేయలేమని చెప్పడంతో రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి అనంతరం విక్రయిస్తున్నారు. తడిచిన ధాన్యానికి తక్కువ ధర లభిస్తూ ఉండటంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. 
 
కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పండిన పంటలను అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు కరోనాతో ఇబ్బందులు పడుతున్న రైతులను అకాలవర్షాలు మరోవైపు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న తక్కువగానే కేసులు నమోదైనప్పటికీ నాలుగు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: