అసలే కరోనా కాలం.. లాక్ డౌన్‌ తో హౌజ్ అరెస్టు.. బయటకు వెళ్లేందుకు లేదు. ఉన్న మహారాజులకు ఎలాగైనా కాలం గడుస్తుంది. మరి కూలీ నాలీ చేసుకుని బతికే వాళ్లకు, రెక్కాడితే కానీ డొక్కాడని జనాలకు ఈ కరోనా కాలం ఆకలి కేకలు పంచుతోంది. ఇలాంటి వాళ్లకు దాతలు పంపే అన్నం ప్యాకేట్లే ఆసరాగా నిలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు పాత పథకాన్ని టీడీపీ నేతలు బాగా తరచు ప్రస్తావిస్తున్నారు.

 

 

ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉండుంటే కనీసం పేదలు రోజూ మూడు పూటలా ఇంత తిని బతికేవాళ్లు అంటూ పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విమర్శలు జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. జనం కూడా అవును కదా.. ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉంటే ఇలాంటి ఆకలి కేకలు ఉండేవి కాదు కదా అన్న అభిప్రాయం వస్తోంది. అయితే దీనితో వైసీపీ నేతలు ఏకీభవించడం లేదనుకోండి.

 

 

అన్న క్యాంటీన్లు లేకున్నా అంతకు మించి 60 వసతి గృహాలు ద్వారా భోజనాలు పెడుతున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ వంటి వారు చెబుతున్నారు. టీడీపీ నాయకులు దోచుకుని దాచుకున్న సొమ్మును బయటకు తీసి ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి ప్రెస్ మీట్లు పెడుతుంటే.. టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

 

 

టీడీపీ నేతలు సహాయం చేయకున్నా పర్వాలేదని.. కానీ సాయాన్ని అడ్డుకోవద్దని అవంతి శ్రీనివాస్‌ అంటున్నారు. కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నామన్న టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసుతో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ నీచ రాజకీయాలు వీడి కరోనాపై పోరాటం చేయాలని హితవు పలికారు.ఎవరెన్ని చెప్పినా.. ఇలాంటి సమయంలో అన్న క్యాంటీన్లు ఉండే బావుండేదన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. జగన్ కు ఆ పేరు నచ్చకపోతే.. వైఎస్సార్ క్యాంటీన్లు అని అయినా పెట్టుకోవాల్సింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: