సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఓ ఫ్యాషన్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ కరోనా కాలంలో ఇవి మరీ ఎక్కువయ్యాయి. అయితే అవి చివరకు రాష్ట్ర పతి భవన్ ను కూడా వదలి పెట్టలేదు. రాష్ట్రపతి సచివాలయంలో పనిచేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని మంగళవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది. ఇది కాస్తా సోషల్ మీడియాకూ పాకింది.

 

 

ఇంతా చేస్తే.. తీరా చూస్తే.. ఆ వార్తలలో ఏమాత్రం నిజం లేదని రాష్ట్రపతి భవన్ వివరణ ఇచ్చింది. అసలు ఇప్పటి వరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ లో పనిచేసే ఏ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని రాష్ట్రపతి భవన్ అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సెక్రటేరియట్ సహా, స్థానిక అధికారులు కరోనా వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

 

 

మరి ఏకంగా రాష్ట్రపతి భవన్ పైనే ఇంతగా తప్పుడు వార్తలు ఎలా పుట్టుకొచ్చాయి. అసలు నిప్పు లేకుండా పొగ రాదంటారు కదా. మరి ఇక్కడ నిప్పే లేదా.. లేకపోతే రాష్ట్రపతి పరువుకు సంబంధించిన విషయం కదా అని దాన్ని పక్కదారి పట్టిస్తున్నారా అన్న వాదన వినిపిస్తోంది. అయితే రాష్ట్రపతి వంటి కీలకమైన పదవిలో ఉన్న కార్యాలయానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి అధికార వర్గాలు చెప్పిందే తుది సమాచారం అవుతుంది.

 

ఏదేమైనా.. సోషల్ మీడియా వచ్చేశాక ఇప్పుడు ఏ వార్త అయినా సరే క్షణాల మీద ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ఫేస్ బుక్, వాట్సప్.. ఇన్‌స్టాగ్రామ్.. ఇలా అనేక వేదికలపై సమాచారం రాకెట్ వేగంతో స్ప్రెడ్ అవుతోంది. అయితే మొదట వచ్చిన సమాచారం తప్పయినా సరే.. ఆ విషయం గమనించేలోగానే అది కోట్ల మందికి చేరిపోతోంది. అలా అనేక తప్పుడు విషయాలు జనంలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రపతి భవన్‌ కూ కోవిడ్ ముప్పు అనే వార్త కూడా అలాంటిదే కావచ్చు. అలాగే కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: