సూర్యాపేట జిల్లాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది . మంగళవారం అనూహ్యంగా పాజిటివ్ కేసుల సంఖ్య జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన విషయం తెల్సిందే . ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా , తొలిసారిగా గ్రామీణ ప్రాంత జిల్లాలో అధిక కేసులు నమోదు కావడం అధికారుల్ని కలవరపరుస్తోంది . ఇప్పటి హైదరాబాద్, కరీంనగర్ , నిజామాబాద్ వంటి నగరాల్లో మాత్రమే అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో , మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే కావడంతో కరోనా లింక్ కనిపెట్టడం లో అధికారులు సక్సెస్ అయ్యారు .

 

అయితే ఇప్పుడు   గ్రామీణ ప్రాంతాల్లో  కూడా  కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది . ఎట్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత జిల్లా లోని కరోనా మూలలను పసిగట్టి లింక్ తెంచాలన్న లక్ష్యం తో అధికారులు ముందుకు వెళ్తున్నారు . సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని వర్ధమానుకోట గ్రామానికి చేరిన కరోనా వైరస్, ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఏపూరు గ్రామానికి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు . పొరుగు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి జిల్లాలో జరిగిన ఒక విందుకు హాజరుకావడం వల్లే వైరస్ జిల్లాకు చెందిన వ్యక్తులకు సోకిందన్న నిర్ధారణకు వచ్చిన అధికారులు , ఎట్టి పరిస్థితుల్లో సూర్యాపేట జిల్లాలోకి ఇతర జిల్లాల వారిని అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు .

 

కరోనా కట్టడికి లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది . జిల్లాను అష్టదిగ్బంధనం చేసి , కరోనా పాజిటివ్ గ్రామాల్లో నిఘా పెంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు . కనీస అవసరాలకు కూడా వారిని గ్రామం దాటనివ్వకుండా వారికి అన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: