కరోనా నిర్ధారణ కు అవసరమైన  ర్యాపిడ్ కిట్ల కొనుగోలు వ్యవహారం లో ప్రభుత్వం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలకు ధీటుగా  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ప్రత్యారోపణలు రెండు పార్టీల మధ్య అగ్గి రాజేశాయి . కన్నాకు మద్దతుగా ఆ పార్టీ అగ్రనేతలు బరిలోకి దిగి మాటల యుద్ధాన్ని కొనసాగిస్తుండగా , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తామేమి తక్కువ తినలేదన్నట్లుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు , మంత్రుల ద్వారా బరిలోకి దించుతోంది .   ఇప్పటి వరకూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్ సంబంధాలు కొనసాగుతున్నాయి .

 

అయితే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నేతలు మాత్రం, రాష్ట్రం లో  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను తప్పుపడుతూ , తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు . ఇది ఏమాత్రం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రుచించడం లేదు . తాము కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తుంటే , రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం , ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ తో జట్టు కట్టినట్లుగా వ్యవహరించడం ...  వారిని తీవ్ర అసహనానికి గురి చేస్తోంది .   కరోనా నిర్ధారణ కోసం కొనుగోలు చేసిన ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లపై అచ్చంగా టీడీపీ చేసిన ఆరోపణలనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా చేయడంతో , ఎప్పటి నుంచో రాష్ట్ర బీజేపీ నాయకత్వ  వైఖరిపై  తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం , ఆ రెండు పార్టీలను ఒకే గాటన కట్టే ప్రయత్నం చేసింది .

 

దానిలో భాగంగానే కన్నా , చంద్రబాబుకు అమ్ముడుపోయారని విజయసాయి ఆరోపణలు చేసినట్లుగా స్పష్టం అవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . అయితే కథను కాసింత రక్తి కట్టించేందుకు అందులోకి విజయసాయి , ఈ వ్యవహారంలోకి సుజనాను లాగడం... బీజేపీ  నేతలపై , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ చేసిన ఆరోపణలను కమలనాథులు  సీరియస్ గా తీసుకోవడం చూస్తుంటే ఈ వ్యవహారం మరింత రాజకీయ దుమారాన్ని రేపే అవకాశాలున్నాయని అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: