ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం.. ఈ మాట మన చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇండియాలో సామాన్యుడు ఎక్కువగా ఖర్చు చేసేది పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం.. ఈ రెండింటి ఖర్చూ చాలా ఎక్కువ. కొన్ని కుటుంబాలు వీటి కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోతాయి కూడా. అదే విదేశాల్లో ఈ రెండు రంగాల్లోనూ ప్రభుత్వం చొరవ ఉంటుంది.

 

 

ఇప్పటికీ ఇండియాలో ఓ మాదిరి పట్టణలాల్లో తప్పించి గ్రామాల్లో వైద్య సదుపాయలే కరవు. ఏదైనా పెద్ద జబ్బు వస్తే పట్టణాలకు పరుగులు తీయాల్సిందే. అందుకే.. ప్రభుత్వం, ప్రైవేటు వైద్యశాలలు, ఆరోగ్య బీమా సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థలను పటిష్ఠంగా తీర్చిదిద్దాలి. మరో కీలక అంశం బీమా.. మన దేశంలో చాలా మందికి ఆరోగ్య బీమా అంటూ ఒకటి ఉందన్న విషయమే తెలియదు. అందుకే దేశంలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలి.

 

 

దేశంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాలను స్థాపించాలి.అందులో చదువుకునే అవకాశం అర్హతగల స్థానిక విద్యార్థులకు కల్పించాలి. వారు ఉతీర్ణులైన తరవాత అదే జిల్లాలో వైద్యులుగా పనిచేసేలా రూల్ పెట్టాలి. ఏదైనా జబ్బు వస్తే పెట్టే ఖర్చులో వందో వంతు ముందు ఖర్చు చేసి పరీక్షలు చేయించుకున్నా చాలా జబ్బులు అరికట్టవచ్చు. అసలు జబ్బు వచ్చే వరకూ మనం మేలుకోం. అందుకే.. బీమా పథకంలో సంపూర్ణ ఆరోగ్య పరీక్షలకు అవకాశం కల్పించాలి.

 

 

మందులతో పాటు వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలనూ ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలి. రోగ నిరోధక చికిత్సపై దృష్టి పెడితే వ్యాధుల పాలబడ్డాక చేసే భారీ వ్యయాన్ని అరికట్టొచ్చు. ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసే ప్రక్రియ పక్కాగా జరగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: