కరోనా కోరల్లో చిక్కుకున్న అమెరికాను ముందుండి నడిస్తున్నది ఎవరో తెలుసా..? లక్షలాది కరోనా కేసులతో దేశం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నదెవరో తెలుసా ? ఎవరి వల్లనైతే అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతారని ట్రంప్ బాధపడుతున్నారో వాళ్లే. వలసదారులపై ద్వేషం పెంచుకున్న ట్రంప్‌కు అర్ధంకాని విషయం ఏంటంటే.. కరోనా నుంచి అమెరికాను కాపాడుతున్న వారిలో ఎక్కువ మంది వలసదారులే ఉన్నారన్న విషయం.

 

వలసదారులు వద్దు...అమెరికన్లే ముద్దు అంటున్నారు ట్రంప్..! అమెరికా ఫస్ట్ నినాదంతో అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్... కరోనా సంక్షోభ సమయంలో కూడా అదే పాలసీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెరికాను, అమెరికన్లను కాపాడుకోవడానికి వలసదారులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ట్రంప్ సంతకం చేశారు. అంటే ఉద్యోగ, ఉపాధి కోసం ఇకపై ఏ దేశం నుంచి ఒక్కరి నుంచి అమెరికాకు అనుమతించరు. అమెరికన్లకే పెద్ద పీట వేస్తారు.


 
ట్రంప్ ఆలోచనలు ఎలా ఉన్నా...అమెరికాను నమ్ముకుని ఆదేశంలో అడుగుపెట్టిన వలసదారులు కేవలం రెండు చేతులతో సంపాదించుకోవడంపైనే ఫోకస్ పెట్టడం లేదు. ఇప్పటి వరకు  అమెరికా నిర్మాణంలో భాగస్వాములవుతూ వస్తున్న ఇమిగ్రెంట్స్... కరోనా సంక్షోభ సమయంలోనూ దేశానికి అండగా నిలిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఫ్రంట్‌లైన్స్‌గా ఉండి... బాధితులకు సాయం చేస్తున్న వారిలో వలసదారులే ఎక్కువమంది ఉన్నారు. ఇమిగ్రేషన్ పాలసీ ఇనిస్టిట్యూట్ విశ్లేషణ ప్రకారం అమెరికాలో కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వారిలో ఒరిజినల్ అమెరికన్స్ కంటే.. వలసదారులే ఎక్కువమంది ఉన్నారు.

 

కరోనా వైరస్‌పై పోరాటం చేసే వివిధ అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న వారిలో దాదాపు ఆరు కోట్ల మంది  వలసదారులే ఉన్నారు. హెల్త్ కేర్, సోషల్ సర్వీస్, గ్రోసరీ స్టోర్స్, ఫార్మసీస్, గ్యాస్ స్టేషన్స్ , మందులు,  ఆహార ఉత్పత్తులు , వ్యవసాయం, పోస్టల్ సర్వీస్ వర్కర్స్, బస్, మెట్రో , టాక్సీ డ్రైవర్స్..ఇలా వివిధ విభాగాల్లో అత్యవసర సేవలు అందిస్తున్న వారంతా వలసదారులే.. ఇలా దేశానికి సేవచేస్తున్న వారినే ట్రంప్ వద్దనుకుంటున్నారు.

 

అమెరికాలో పనిచేసే ప్రతి నలుగురు వైద్యుల్లో ఒకరు కచ్చితంగా వలసదారులే అయి ఉంటారు. అలాగే హోమ్ హెల్త్ కేర్ విభాగంలో పనిచేసే వారిలో 38 శాతం మంది వలసదారులే. అమెరికా ఫుడ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారిలో 22 శాతం  ఇమిగ్రెంట్సే ఉన్నారు. దాదాపు 4 లక్షల మంది వలసదారులు అమెరికా గ్రోసరీ స్టోర్స్‌లో పనిచేస్తున్నారు. అమెరికా రవాణా వ్యవస్థలో 34 శాతం మంది బయట దేశాల నుంచి వచ్చిన వాళ్లే. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికాలో ప్రతి అత్యవసర విభాగంలోనూ వలసదారులు కనిపిస్తారు. వీళ్లంతా కరోనాకు బయపడి ఇళ్లల్లో కూర్చోకుండా తమ వంతు సేవలు అందిస్తున్నారు. ట్రంప్‌కు మాత్రం వీళ్ల సర్వీస్ కనిపించడం లేదు. వలసదారుల వల్లే అమెరికాకు ముప్పు ఉందని ట్రంప్ భావిస్తూ ఉంటారు. అందుకే నిషేధం విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: