ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే ఇదే మరి. ఎక్కడ ఏ కష్టం వచ్చినా...ఆ ఇబ్బందిని ఎదర్కొనేది మాత్రం రైతులే. ప్రస్తుతం వచ్చిన లాక్ డౌన్ సమస్య మరింత తీవ్రమైందే. అన్ని రకాలుగా రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం సిద్దమైంది. అయితే అసలే సమస్యలో ఉన్న రైతులు మరికొంత ఊరట కోరుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన హమాలీల డబ్బులు ఇస్తే మరింత మేలు జరుగుతుందంటున్నారు అన్నదాతలు.

 

తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే... అన్నదాత సాగులో చాలా బెటర్. వరి పండించటంలో తెలంగాణ టాప్‌లో ఉంటోంది. గడిచిన ఏడాది నాటికి కూడా సుమారు 17 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేవారు. కానీ ఇప్పుడు అది అమాంతంగా 40 నుంచి 45 లక్షల ఎకరాలకు పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగటానికి .. సాగు నీటి వసతి పెరగటమే ప్రధాన కారణం. సుమారు 67 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రైతుకు చేతినిండా డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. కానీ కరోనాతో దెబ్బ పడింది. చేతికి డబ్బులు రావాలంటే ఆలస్యం అవుతుంది. ఇది రబీ రైతు ఒక్కరికే నష్టం కలిగించే అంశం కాదు. వచ్చే ఖరీఫ్ పై కూడా దీని ప్రభావం ఉండబోతుంది. సకాలంలో పండించిన పంటకు వచ్చే ఆదాయం చేతికి అందితే అటు కరీఫ్ కి విత్తనాలు, సాగు చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ... ఇప్పుడు రబీలో ధాన్యం డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. 

 

ప్రభుత్వం మే 7 వరకు లాక్ డౌన్ పొడగించిన తరుణంలో... సర్కారుకు కూడా ఆర్థిక ఇబ్బందులున్నాయి. కానీ వీటితో సంబంధం లేకుండా రైతులు మామత్రం జూన్ నుంచి ఖరీఫ్ కు రెడీ కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఓ వైపు రైతు బంధు డబ్బులు వేయాలి.  మరో వైపు రబీలో పండించిన పంటను కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి సగటు రైతుకైనా... అటు సర్కార్ కి అయినా సమస్యే. బ్యాంకులు అన్నీ బాగుంటేనే రుణాలు ఇవ్వటం అంతంత మాత్రం. ఇప్పుడు బ్యాంకులు విరివిగా రైతులను ఆదుకోవటానికి ముందుకు వస్తాయా..? అనేది అనుమానమే. 

 

ప్రస్తుతం రైతులు పండించిన పంటను ప్రతి ఊర్లో కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేస్తుండటంతో.. ప్రతీ రైతు నుంచి బస్తాకు 32 రూపాయలు హమాలీ ఛార్జీ.. దీనికి తోడు సుతిలీ ఛార్జీ ఒక రూపాయితో కలుపుకుని... మొత్తం 33 రూపాయలు బస్తాకు వసూలు చేస్తున్నారు. ఇలా గడిచిన రెండేళ్లుగా రైతులే హమాలీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ డబ్బును ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ రెండేళ్లుగా డబ్బులు అందించటం లేదని రైతులు ఇబ్బందిపడుతున్నారు. రెండేళ్లుగా బకాయి పడ్డ డబ్బులును చెల్లిస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుందని కోరుతున్నారు రైతులు.

 

హమాలీ ఛార్జీల కింద ఒక్కో రైతూ.. తక్కువలో తక్కువగా సుమారు 4 వేల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నపరిస్ధితిలో... హమాలీలకు ప్రభుత్వమే నేరుగా డబ్బులు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు రైతులు. దీనికి తోడు ధాన్యం కాంటా వేసే చోట 40 కిలోల కంటే తక్కువ తూకం ఉన్న ధాన్యం బస్తా ని కొనుగోలు చేయటం లేదు. నిర్ధేశించిన ధాన్యం పరిమాణం కంటే ఎంత తక్కువ ఉంటే... సరిపడా ధాన్యం పోసి కొనాల్సి ఉంటుంది. కానీ 40 కిలోల కంటే తక్కువ ఉండే ధాన్యాం బస్తాలను తూకం నుంచే పక్కకు తప్పిస్తున్నారు. దీంతో రైతు నష్టపోయే పరిస్ధితి దాపురించింది. 


హమాలీలకు ప్రభుత్వమే నేరుగా డబ్బులు ఇవ్వటంతో రైతులకు కొంత ఊరట కలుగుతుందనేది అన్నదాతల ఆలోచన. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం నుంచి అందాల్సిన హమాలీ డబ్బుల బకాయిలను కూడా చెల్లించాలనే డిమాండ్ రైతుల నుంచి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: