కరోనా ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. దీని ప్రభావం పత్రికలపై దారుణంగా ఉందన్న సంగతి ఇప్పటికే చర్చించుకున్నాం. ఇక ఇప్పుడు జర్నలిస్టులపైనా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 100 మంది వరకూ పాత్రికేయులు కరోనా పాజిటివ్ గా తేలారు. ఎక్కువగా ముంబైలో జర్నలిస్టులకు కరోనా వచ్చింది. ఆ తర్వాత తమిళనాడులో ఓ ఛానల్లో ఏకంగా 50 మంది వరకూ కరోనా పాజిటివ్ గా తేలిందట.

 

 

దీంతో ఆ ఛానల్ ను తాత్కాలికంగా మూసేశారు. ఇక ఇప్పుడు ఈ కరోనా ప్రభావం తెలుగు జర్నలిస్టులపైనా పడుతోంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్టీవీతో పాటు మరికొందరు కొందరు రిపోర్టర్లకు కరోనా వచ్చిందని వార్తలు వచ్చాయి. అందుకే ఇక తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే జర్నలిస్టులకు కరోనా వచ్చినా పట్టించుకునే స్థాయిలో యాజమాన్యాలు లేవు.

 

 

ఇలాంటి విపత్కాలాల్లో జర్నలిస్టులు తమ గురించి తామే ఆలోచించుకోవడం బెటర్. అందుకే టీవీ జర్నలిస్టులు, పత్రికల జర్నలిస్టులు రిస్కు తీసుకోవడం మానేయాలి. క్వారంటైన్ కేంద్రాలకూ, కోవిడ్ ఆసుపత్రుల రిపోర్టింగ్‌ కూ వెళ్లడం మానేస్తే మంచిది. ఈ వివరాలను ఎలాగూ వైద్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు మీడియాకు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఆ సమాచారంతో సరిపుచ్చుకోవడం బెటర్.

 

 

అదే సమయంలో పనికిమాలిన నాయకుల ప్రెస్ మీట్లను కూడా ఎవాయిడ్ చేయడం మంచిది. ఈ కరోనా సమయంలో చిన్నా చితకా వార్తలకు ఎలాగూ టీవీల్లోనూ, పత్రికల్లోనూ చోటు దక్కదు. అందుకే అత్యవసరం అయితే తప్ప ప్రెస్ మీట్లను కూడా పక్కకు పెట్టడం బెటర్. అత్యవసరం కొద్దీ వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో రిస్కు తీసుకుని మీ కుటుంబాలను ఆపదలోకి నెట్టకండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: