భార‌త‌దేశంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 1,486 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య దేశంలో 20,471కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 49 మంది మృత్యువాతపడ్డారు. అయితే, దేశంలో క‌రోనా వైర‌స్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో అంత‌క‌న్నా స్పీడ్ గా క‌రోనా గురించి కొత్త కొత్త వ‌దంతులు వ్యాపిస్తున్నాయి. క‌రోనా వైర‌స్ స్ప్రెడ్, వ్యాధి నివార‌ణ, వైద్యం ఇలా ర‌క‌ర‌కాల అంశాల గురించి‌ రోజుకో ర‌క‌మైన ఫేక్ న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా మ‌రో రూమ‌ర్ మొద‌లైంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి మే 3 వ‌ర‌కు పొడిగించిన లాక్ డౌన్ అక్క‌డితో ఆగ‌ద‌ని, ఆ త‌ర్వాత కూడా కొన‌సాగుతుంద‌ని ఓ న్యూస్ చానెల్ ప్ర‌సారం చేసింది. 

 


క‌రో‌నా వైర‌స్ క‌ట్ట‌డి కోసం గ‌త నెల 24 అర్ధ‌రాత్రి నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కు తొలుత ప్ర‌ధాని మోడీ లాక్ డౌన్ విధించారు. అయితే ఆ గ‌డువు ముగిసే స‌మ‌యానికి క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండ‌డంతో లాక్ డౌన్ ను మ‌ళ్లీ మే 3 వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త వారంలో దీనిపై మోడీ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే, మే 3 త‌ర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించాల‌ని క‌రోనాపై నియ‌మించిన నేష‌న‌ల్ టాస్క్ ఫోర్స్ ఇప్ప‌టికే ప్ర‌ధాని మోడీకి రిపోర్ట్ అందించింద‌ని వార్త ప్ర‌చారం చేసింది. అయితే ‌దీనిపై కేంద్ర ప్ర‌భుత్వ మీడియా విభాగం ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (PIB) స్పందించింది. PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ వార్తలో నిజం లేదంటూ స్ప‌ష్టం చేసింది. మే 3 త‌ర్వాత లాక్ డౌన్ పొడిగించాలంటూ ఎటువంటి రిపోర్ట్ ప్ర‌ధానికి అంద‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

 


ఇదిలాఉండ‌గా, కోవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు 652 మంది మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా కరోనా వైరస్‌ ట్రాన్సిమిషన్‌ తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దేశంలోని 403 జిల్లాలకు వైరస్‌ విస్తరించింది. ముంబయి 3 వేల కేసులతో టాప్‌లో కొనసాగుతుండగా తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-2,081, అహ్మదాబాద్‌-1,298, ఇండోర్‌-915, పూణె-660, జైపూర్‌లో 537 కేసులు నమోదయ్యాయి. 60 శాతానికి పైగా కేసులు మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, తమిళనాడు ఈ ఐదు రాష్ర్టాల్లోనే నమోదయ్యాయి. భారత్‌లో నేటి వరకు 20,471 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీటిలో 15,859 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 3,960 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 652 మంది ఇప్పటివరకు మృతిచెందారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: